Commonwealth Games 2022 Hockey players fight: మైదానంలో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం సహజమే. అయితే అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు హద్దుమీరుటుంటాయి. ప్లేయర్స్ కొట్టుకునే వరకు వెళ్తుంటారు. అయితే తాజాగా హోరాహోరీగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లోనూ ఇదే సంఘటన జరిగింది.
ఇప్పటికే ఈ గేమ్స్‌లోని పలు ఈవెంట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. అయితే ఇంకా రెజ్లింగ్ పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా హాకీ మ్యాచ్ జరుగుతుండంగానే మధ్యలో కుస్తీ పోటీలు జరిగాయి. అది కూడా ప్రొఫెషనల్ రెజ్లర్ల లాగా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. గొంతు, జెర్సీలు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లారు. పురుషుల హాకీ మ్యాచ్‌లో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లాండ్-కెనడా జట్ల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా కెనడా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ స్థానం ఖాయమైంది. అయినా ఇంగ్లిష్ జట్టు దూకుడుగా ఆడింది. రెండవ క్వార్టర్ ముగిసే సమయానికి కెనడాపై 4-1 ఆధిక్యం సాధించింది. అయితే ఇదే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫార్వార్డ్ నిరంతరం కెనడా గోల్ పోస్ట్‌పై దాడులు చేశాడు. మరోవైపు కెనడియన్ డిఫెండర్ వాటిని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అప్పుడే ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రిఫిత్స్, కెనడాకు చెందిన బాల్‌రాజ్ పనేసర్ ముఖాముఖిగా తలపడ్డారు. గ్రిఫిత్స్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించగా, పనేసర్ అతనిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే హాకీ స్టిక్ గ్రిఫిత్స్ పొట్ట దగ్గరికి వచ్చింది. దీంతో ఇంగ్లీష్ ఆటగాడు కోపోద్రిక్తుడయ్యాడు. ప్రత్యర్థి ఆటగాడి జెర్సీని పట్టుకుని అతని మెడను దగ్గరకు లాగాడు. పనేసర్ కూడా కోపంగా చూస్తూ గ్రిఫిత్స్ గొంతును పట్టుకున్నాడు. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. ఇంతలోనే ఇరు జట్ల ఆటగాళ్లు వారిని విడిపించడానికి ప్రయత్నించారు. కాగా మ్యాచ్ మధ్యలోనే గొడవకు దిగిన ఆటగాళ్లపై రెఫరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనేసర్‌కు రెడ్ కార్డ్ చూపించి మ్యాచ్ నుంచి బయటకు పంపాడు. గ్రిఫిత్స్‌కు కూడా ఎల్లో కార్డు కూడా చూపించాడు. కాగా గ్రిఫిత్స్ మొదట జెర్సీని పట్టుకున్నప్పటికీ, పనేసర్ ఏకంగా గొంతు పట్టుకున్నాడు. అందుకే అతనికి రెడ్‌కార్డ్ చూపించి బయటకు పంపించారు రెఫరీ. కాగా ఈ గొడవతో కెనడా అన్ని విధాలా నష్టపోయింది. అప్పటికే 1-4తో వెనుకబడిన జట్టు చివరికి 2-11తో దారుణంగా ఓడిపోయింది.
ఇదీ చూడండి: స్వదేశంలో కోర్టుల్లో గెలిచి.. విదేశంలో క్రీడల్లో విజేతగా నిలిచి..