భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మామూలుగానే ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఆటగాడు. సిరీస్‌ల మధ్య ఖాళీ దొరికినా అతను కసరత్తులు మానడు. ఇప్పుడు కరోనా కారణంగా టీమ్‌ఇండియా ఆడాల్సిన అంతర్జాతీయ సిరీస్ రద్దయింది. ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో బయటి ప్రపంచానికి దూరంగా భార్య అనుష్క శర్మతో కలిసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు కోహ్లీ. ఈ ఖాళీ సమయంలో ఆటకు దూరమైనా కసరత్తులకు మాత్రం అతను దూరం కాలేదు. రోజూ కేటాయించే సమయానికి మించి అతను జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఆట మళ్లీ ఎప్పుడు మొదలైనా.. శారీరకంగా పూర్తి సన్నద్ధతతో ఉండాలన్న లక్ష్యంతో అతను కష్టపడుతున్నట్లు తెలిసింది. ఇక విరామం లేకుండా సిరీస్‌లు ఆడి అలసిపోయిన మిగతా టీమిండియా క్రికెటర్లు కొంత కాలం విశ్రాంతి తీసుకుని.. తర్వాత ఫిట్‌నెస్ మీద దృష్టిసారించబోతున్నారు. ఈ విషయంలో జట్టు యాజమాన్యం నుంచి ఆటగాళ్లకు సూచనలు వెళ్లినట్లు సమాచారం.
క్రికెటర్లు మాత్రమే కాదు.. ఇతర క్రీడాకారులందరూ కూడా ఫిట్‌నెస్ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒలింపిక్స్ ముంగిట టోర్నీలు రద్దవడం, వాయిదా పడటం క్రీడాకారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఆటగాళ్లపై ఒత్తిడి రెట్టింపవడం ఖాయం. అత్యవసరంగా అర్హత టోర్నీల్లో పోటీ పడాల్సి రావచ్చు. ఒలింపిక్స్ సన్నద్ధతలో భాగంగా తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటిపట్టునే కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్ పెంచుకునే ప్రయత్నంలో పడ్డారందరూ. మానసిక దృఢత్వం కోసం యోగా మీద దృష్టిసారిస్తున్నారు.
"ఈ ఖాళీ సమయాన్ని ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటున్నా. మామూలు రోజుల్లో కంటే ఎక్కువ కసరత్తులు చేస్తున్నా."
- మేరీకోమ్, బాక్సర్
15 ఏళ్లుగా బ్యాడ్మింటన్ సాధన చేస్తూ వచ్చిన నేను.. ఇలా ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి. అయితే ఈ సమయంలో ఇంటి దగ్గరే కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినా సిద్ధమే.