WTC Final 2023 Shubman Gill : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బలయ్యాడు!
444 పరుగుల భారీ లక్ష్యంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ధాటిగా మొదలుపెట్టారు. అయితే శుభ్‌మన్ గిల్ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన భారత ఓపెనింగ్ జోడీ.. అదిరిపోయే శుభారంభాన్ని అందించే ప్రయత్నం చేసింది. కానీ స్కాట్ బోలాండ్ వేసిన 8వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ తొలి బంతిని బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. కామెరూన్ గ్రీన్ సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు అనిపించింది.
దాంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించగా.. క్లారిటీ రాలేదు. చివరకు బంతి కింద చేతి వేళ్లు ఉన్నాయని థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఈ క్యాచ్‌ను గ్రీన్ రెండేళ్ల సాయంతో పట్టుకున్నాడు. క్యాచ్ పట్టుకునే క్రమంలో బంతిని నేలకు రుద్దినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం వేళ్లు కింద ఉన్నాయని ఔటివ్వడం వివాదాస్పదమైంది.
చాలా మంది ఎక్స్‌పర్ట్స్ గిల్ ది నాటౌట్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ సైతం నిరాశగా.. అంపైర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంపైర్‌తో ఈ నిర్ణయంపై వాగ్వాదానికి దిగాడు. మంచి టచ్‌లో కనిపించిన ఈ జోడీ.. అంపైర్ తప్పుడు నిర్ణయంతో విడిపోవడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఓవల్ మైదానం ప్రేక్షకులు ఛీటర్ ఛీటర్ అంటూ గట్టిగా అరిచారు. భారత అభిమానులు కెటిల్ బరోపై తీవ్ర ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అతడు అంపైరింగ్ చేసిన ప్రతీ నాకౌట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిపాలైందని మండిపడుతున్నారు. అంపైరింగ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ఉందని విమర్శిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ నాటౌట్ అంటూ ఆధారాలతో సహా అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.