తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final 2023 : నాలుగో రోజు ఆట పూర్తి.. భారత్​ మరో 280 పరుగులు చేస్తేనే.. - డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 టీమ్​ఇండియా

WTC FINAL 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట పూర్తయింది. ఆసీస్‌ నిర్దేశించిన 444 లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులతో నిలిచింది. భారత్‌ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు చేయాలి.

WTC Final 2023
WTC Final 2023

By

Published : Jun 10, 2023, 10:39 PM IST

Updated : Jun 10, 2023, 10:45 PM IST

WTC FINAL 2023 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) పరుగులతో ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం. రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. శుభ్‌మన్‌ గిల్ (18), చెతేశ్వర్‌ పుజారా (27) మరోసారి నిరాశపరిచారు.

మంచి ఆరంభమే కానీ..
WTC Final 2023 Team India : భారీ లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియాకు మంచి ఆరంభమే దక్కిందని చెప్పాలి. కమిన్స్‌ వేసిన మూడో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ రెండు ఫోర్లు, రోహిత్‌ ఒక ఫోర్‌ రాబట్టారు. బొలాండ్ వేసిన తర్వాతి ఓవర్‌లో హిట్‌మ్యాన్‌ మరో బౌండరీ బాదాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ దూకుడు కొనసాగిస్తూ స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదాడు. 7 ఓవర్లకు 41/0తో నిలిచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఏర్పడుతున్న సమయంలో శుభ్‌మన్ గిల్‌ను బొలాండ్ పెవిలియన్‌కు పంపాడు. గిల్‌ స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే టీ విరామం ప్రకటించారు. అనంతరం పుజారాతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రోహిత్‌ నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే చెతేశ్వర్‌ పుజారా వికెట్ కీపర్‌ కేరీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 93 పరుగులకే టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానె మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

WTC Final 2023 Australia : ఓవర్‌ నైట్‌ స్కోరు 123/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ (41) ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడబోయి స్లిప్‌లోని పుజారా చేతికి చిక్కాడు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. లంచ్‌ బ్రేక్‌కు ముందు జడేజా బౌలింగ్‌లో కామెరూన్‌ గ్రీన్ (25) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 201/6తో నిలిచింది. రెండో సెషన్ ఆరంభం నుంచి మిచెల్ స్టార్క్‌ (41; 57 బంతుల్లో) నిలకడగా బౌండరీలు సాధించాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. షమి బౌలింగ్‌లోనూ వరుసగా రెండు ఫోర్లు బాదిన స్టార్క్‌.. అదే ఓవర్లో స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే షమి బౌలింగ్‌లోనే కమిన్స్‌ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చిన వెంటనే ఆసీస్‌ డిక్లేర్డ్ చేసింది.

Last Updated : Jun 10, 2023, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details