యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ డ్రా వెలువడిన నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌లు తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు మధ్య జరిగే పోరులో ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారని అన్నాడు. అలాంటి పరిస్థితి రానివ్వకుండా సారథి కోహ్లీ, రోహిత్ శర్మ బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో తాను ఆడిన తొలి మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు.
"పాకిస్థాన్‌తో నా తొలి మ్యాచ్ ఆడేటప్పుడు ఎక్కువ ఉత్సాహానికిలోనై ఒత్తిడికి గురయ్యాను. అలాగే రాబోయే ప్రపంచకప్‌లో కొంతమంది ఆటగాళ్లకు ఈ విధంగానే అవ్వొచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండే బాధ్యతను కోహ్లీ, రోహిత్ శర్మ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇరు దేశాల మధ్య ఉండే భావోద్వేగాల సమ్మేళనం. కేవలం బ్యాట్, బంతి మధ్య జరిగే పోరు కాదు అంతకన్నా ఎక్కువ."
-గంభీర్, మాజీ క్రికెటర్.
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ ఊతప్ప మాట్లాడుతూ.. "భారత్-పాక్ మధ్య అంటే ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. దాయాదుల మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాలు సమ్మేళనం. ఇరు జట్లపై గెలుపు అంచనాలు సమానంగా ఉంటాయి." అని అన్నాడు.
అక్టోబర్ 17 నుంచి నవంబరు 14 వరకు ఈ టీ20 ప్రపంచకప్ జరగనుంది. మార్చి 2021 నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ మెగాటోర్నీ డ్రాను ప్రకటించారు. దీనిని సూపర్ 12 మ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు.