Team India new bowling coach: టీమ్ఇండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకున్న తర్వాత జట్టులో కీలక మార్పులు జరిగాయి. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ బాధ్యతలు తలకెత్తున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే భారత జట్టు బౌలింగ్ కోచ్‌నూ మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఈ బాధ్యతను చేపట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే సేవలందిస్తున్నాడు. అతని సేవలపై సంతృప్తిగాలేని భారత జట్టులోని కీలక ఆటగాడు.. అగార్కర్ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023 సన్నాహాల్లో భాగంగా అగార్కర్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
"భారత్ క్రికెట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ ఆటగాడు.. వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో అగార్కర్ వంటి అనుభవజ్ఞుడు భారతజట్టు బౌలర్లకు మార్గనిర్దేశకుడిగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాడు. మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్. అతడు భారత-ఎ, అండర్ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉంటే.. అగార్కర్ సీనియర్లను చూసుకోవాలని భావిస్తున్నాడు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
44 ఏళ్ల అగార్కర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడగా నిరాశ ఎదురైంది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు అగార్కర్ ప్రాతినిధ్యం వహించాడు. 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 349 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి:Chess: ప్రజ్ఞానంద ఖాతాలో మరో రెండు విజయాలు