తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే విప్లవం అప్పుడే మొదలైంది.. చాలా ఇబ్బంది పడ్డా!: సచిన్​

Sachin 1000th ODI match: ఉపఖండంలో వన్డే విప్లవం 1996 ప్రపంచకప్‌ సమయంలో మొదలైందని భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ అన్నాడు. వన్డేలకు కొత్త రూపు వచ్చిన క్షణాలను తాను అనుభవించినట్లు చెప్పాడు. తన కెరీర్‌లో ఆడిన అయిదు అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లు ఎంచుకోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు.

Sachin 1000th ODI
సచిన్​ 1000వ వన్డే

By

Published : Feb 5, 2022, 6:44 AM IST

Sachin 1000th ODI match: ప్రపంచ క్రికెట్లో వెయ్యి వన్డేలు ఆడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు టీమ్‌ఇండియా ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉంది. విండీస్‌తో తొలి వన్డేతో భారత్‌ ఆ మైలురాయి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ టీమ్‌ఇండియా ఆడిన 999 మ్యాచ్‌ల్లో ఏకంగా 463 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన దిగ్గజం సచిన్‌ ఎన్నో జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ఉపఖండంలో వన్డే విప్లవం 1996 ప్రపంచకప్‌ సమయంలో మొదలైందని అతను వెల్లడించాడు. చిన్నతనంలో టెస్టు క్రికెట్‌ ఆడాలనేది కలగా ఉండేదని, వన్డేల గురించి ఆలోచించలేదని చెప్పాడు.

"భారత్‌ తరపున టెస్టు క్రికెట్‌ ఆడాలనేది కలగా ఉండేది. ఎప్పుడూ నా బుర్రలో అదే తిరిగేది. అప్పటికే దేశంలో వన్డేలు ఆడుతున్నారు. కానీ అప్పుడు చిన్నపిల్లాడిగా వన్డేల గురించి ఆలోచించలేదు. 1996 ప్రపంచకప్‌ నుంచి వన్డేలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అప్పుడే గొప్ప మార్పు సంభవించింది. అంతకంటే ముందే 1983 ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. కానీ 1996 తర్వాతే మార్పులు వేగంగా జరిగాయి. వన్డేలకు కొత్త రూపు వచ్చిన క్షణాలను నేను అనుభవించా" అని సచిన్‌ తెలిపాడు.

ఎర్రబంతి నుంచి..

భారత్‌ తరపున 200 నుంచి 800 వన్డే వరకూ ప్రతి మైలురాయిలో భాగమైన సచిన్‌.. మొదట్లో ఎర్రబంతితో ఆడే వన్డే నుంచి 2012లో రిటైరయ్యే లోపు డేనైట్‌ మ్యాచ్‌ల వరకూ ఎన్నో మార్పులకు సాక్షిగా నిలిచాడు. "వన్డేల్లో ఎన్నో మార్పులు చూశా. 1990లో న్యూజిలాండ్‌లో ముక్కోణపు సిరీస్‌లో తొలిసారి తెల్లబంతితో మ్యాచ్‌ ఆడడం గుర్తుంది. భారత్‌లో దిల్లీలోని జేఎల్‌ఎన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో రంగురంగుల జెర్సీ వేసుకుని తొలి డేనైట్‌ వన్డే ఆడా. అప్పట్లో మ్యాచ్‌కు ఒకటే తెల్లబంతి వాడేవాళ్లు. అది పాతబడి మురికిగా మారితే చూడడం కష్టంగా ఉండేది. అప్పుడది రివర్స్‌ స్వింగ్‌ కూడా అయ్యేది. కానీ ఇప్పుడు మ్యాచ్‌లకు రెండు బంతులు వాడుతున్నారు. అప్పటితో పోలిస్తే కొత్త బంతుల విధానంలో, ఫీల్డింగ్‌ ఆంక్షల్లో విభిన్నమైన మార్పులు వచ్చాయి" అని సచిన్‌ వివరించాడు. 1991లో ఆస్ట్రేలియాలో వన్డేలు, టెస్టులు, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వన్డేలు ఆడాల్సి వచ్చినప్పుడు బంతి రంగు కారణంగా ఇబ్బంది పడ్డానని అతను గుర్తు చేసుకున్నాడు.

ఆ అయిదు ఇన్నింగ్స్‌లు..

తన కెరీర్‌లో ఆడిన అయిదు అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లు ఎంచుకోవడం చాలా కష్టమని సచిన్‌ చెప్పాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ గురించి మాటల్లో చెప్పడం కష్టమని, తన జీవితంలో అదో గొప్ప రోజని, దాన్ని మిగతా వాటితో కలపలేనని తెలిపాడు. షార్జాలో ఆస్ట్రేలియాపై చేసిన రెండు శతకాలు, దక్షిణాఫ్రికాపై 200 పరుగులు, 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచూరియన్‌లో చేసిన 98 పరుగులు, చివరగా బ్రిస్టల్‌లో కెన్యాపై సెంచరీ తన అత్యుత్తమ అయిదు ఇన్నింగ్స్‌లను అతను వెల్లడించాడు. "ఉత్తమ దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కొని వన్డేల్లో తొలిసారి 200 పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పాకిస్థాన్‌తో ఒత్తిడిలోనూ మెరుగ్గా బ్యాటింగ్‌ చేశా కాబట్టి ప్రపంచకప్‌ల్లో అది నా ఉత్తమ ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది. నా తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను కెన్యాపై చేసిన శతకం ఎప్పటికీ ప్రత్యేకమే" అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: కళ్లు చెదిరేలా వింటర్​ ఒలింపిక్స్.. ఫుల్ జిగేల్ జిగేల్!

ABOUT THE AUTHOR

...view details