ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచులు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆ జట్టు.. తన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఈ టీమ్‌లో బౌలింగ్ విభాగం పేలవమైన ప్రదర్శన చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. ఎక్కువగా వైడ్లు, నోబాల్స్ వేసి అదనపు పరుగులు సమర్పించుకుంటోంది. ఈ విషయంపై సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడు. బౌలర్ల తీరుపై మండిపడ్డాడు కూడా. అయితే తాజాగా ఈ విషయంపై.. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో మూడు నోబాల్స్ వేసిన సీఎస్కే పేసర్ తుషార్ దేశ్‌పాండే మాట్లాడాడు. డెత్ ఓవర్లలో బంతులను సంధించడం అంత సులభం కాదని, తాను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నట్లు చెప్పాడు.
"టీ20ల్లో నో బాల్స్ వేయడం తప్పే. కానీ నేను దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తే మరిన్ని ఎక్కువ పరుగులు అదనంగా సమర్పించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉంటుంది. నేనెప్పుడూ బాగా రాణించడంపైనే ఫోకస్ చేస్తాను. టీమ్ సక్సెస్ కోసం ఆడాలన్నదే నా ధ్యేయం, తపన. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభమైన పని కాదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అయినా మాకు డెత్ ఓవర్లలో గొప్పగా బౌలింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ కోచ్ డీజే బ్రావో ఉన్నారు. ఆయన నుంచి బౌలింగ్ మెలకువలను నేర్చుకుంటున్నాను" అని తుషార్ చెప్పుకొచ్చాడు.