CSK Vs LSG: దాదాపు 1400 రోజుల తర్వాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సీఎస్‌కే అభిమానుల కేరింతలతో మైదానం దద్దరిల్లటం ఖాయం! కరోనా కారణంగా గత మూడు సీజన్లలో హోం గ్రౌండ్‌లో ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఇంటా, బయటా విధానంతో సొంత మైదానాల్లో సందడి వచ్చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సీఎస్‌కేకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి చెన్నైకు బ్యాటింగ్ అప్పగించింది.
జట్లు:
లఖ్‌నవూ: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్నస్ స్టొయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్య, ఆయుష్ ఆదోని, నికోలస్ పూరన్, అవేశ్ ఖాన్, మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్.
చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్థన్ హంగార్గేకర్.
బెన్‌కు ప్రమోషన్!
లీగ్‌లో చెన్నై తొలి మ్యాచ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. గుజరాత్‌పై దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో భారీ స్కోరు సాధించే అవకాశం చేజారింది. దీంతో రెండో మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో పెను మార్పులు చేయాలని భావిస్తోంది. బెన్‌స్టోక్స్, మొయిన్ అలీ, డేవన్ కాన్వే, ధోనీ, జడేజా కూడిన బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. మొదటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన డేవన్ కాన్వే రాణించలేదు. దీంతో అతడి స్థానంలో బెన్ స్టోక్స్‌ను ముందుకు పంపించేందుకు అవకాశం ఉంది. ధోనీ మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓటమితో జట్టులోనూ, బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చేసేందుకు ఆసక్తి చూపడనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. మిడిలార్డర్‌లోనూ రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. దిల్లీపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మార్క్‌వుడ్‌ను ఎదుర్కోవడం చెన్నై బ్యాటర్లకు సవాల్!
సమష్టిగా రాణిస్తూ..
దిల్లీపై తొలి మ్యాచ్‌లో సమష్టిగా ఆడి విజయం సాధించిన లఖ్‌నవూ జట్టులోనూ సమస్యలు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ తన ఫామ్‌లేమిని కొనసాగించడం ఆ జట్టును ఆందోళనకు గురి చేసే అంశం. బ్యాటింగ్‌లో విండీస్ స్టార్ బ్యాటర్లు కైల్ మయేర్స్, నికోలస్ పూరన్ దూకుడుగా ఆడి జట్టును గెలిపించారు. బౌలింగ్‌లో మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన జయ్‌దేవ్ ఉనద్కత్ మరి ఈసారి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి!