ఐపీఎల్-2021లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా దిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని(173) ఉత్కంఠపోరులో ఛేదించింది. దిల్లీ బౌలర్లను ఉతప్ప(63) ఉతికారేశాడు. అతడికి గైక్వాడ్(70) తోడవడం వల్ల విజయం చెన్నైను వరించింది. చివరిలో వచ్చి తనదైన శైలిలో మంచి ఫినిషింగ్ ఇచ్చి.. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు ధోనీ.
ధనాధన్ ఉతప్ప..
173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే.. ఓపెనర్ డుప్లెసిస్ రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. నోర్ట్జే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సమయంలో అభిమానులు రుతురాజ్ గైక్వాడ్‌పై ఆశలు పెట్టుకున్నారు. సీజన్ మొత్తంలో గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు. అయితే ఇక్కడే ఉతప్ప మాయచేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదేసి.. దిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచేడు. మరో ఎండ్‌లో గైక్వాడ్.. ఉతప్పకు మంచి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే ఉతప్ప అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అప్పటికి సీఎస్కే స్కోరు 81/1.
టామ్ కరెన్ 'మలుపు' తిప్పేశాడు..
ఆ తర్వాత కొద్ది సేపు ఇద్దరు వెనుదిరిగి చూడలేదు. దిల్లీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఆశ్విన్ బౌలింగ్‌లో ఉతప్ప కొట్టిన రివర్స్ స్వీప్.. ఇన్నింగ్స్‌కే హైలైట్ అని చెప్పుకోవాలి. అదే ఊపు మీద టామ్ కరెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు ఉతప్ప. బౌండరీ వద్ద శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఉతప్ప ఔట్ అయినా.. గైక్వాడ్ దూకుడు కొనసాగించాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఉతప్ప ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్‌ను టామ్ కరెన్ డకౌట్ చేశాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు(1) పెద్దగా ప్రభావం చూపించలేదు. రబాడ బౌలింగ్‌లో శ్రేయర్ అయ్యర్.. రాయుడిని రనౌట్ చేశాడు.