IPL 2022 GT VS LSG: ఐపీఎల్ 15వ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్ జట్టు బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్ధి జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని19.4 ఓవర్లలోనే గుజరాత్ జట్టు ఛేదించింది. రాహుల్ తెవాటియా (36 : 23 బంతుల్లో 4×4, 2×6), సదరంగాని (15 : 7 బంతుల్లో 3×4) నాటౌట్‌గా నిలిచారు. మాథ్యూ వేడ్ (30), కెప్టెన్ హార్దిక్ పాండ్య (33), డేవిడ్ మిల్లర్ (30) పర్వాలేదనిపించారు. లఖ్‌నవూ బౌలర్లలో దుష్మంత చమీర రెండు, కృనాల్ పాండ్య, అవేశ్ ఖాన్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
159 పరుగుల లక్ష్యంతో దిగిన గుజరాత్ జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్ వేసిన చమీరా బంతికి ఓపెనర్ శుభమన్ గిల్ డకౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్‌శంకర్‌ను(4) కూడా చమీరా పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యను కృనాల్ పాండ్య చక్కటి బంతితో ఔట్ చేశాడు. నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్ మాథ్యూ వేడ్(30).. దీపక్ హుడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా, సదరంగాని మ్యాచ్‌ని ముగించారు.