అనుకున్నదే జరిగింది! చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చిత్తుగా ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఘన విజయం అందుకుంది. సీజన్ తొలి పోరులో ఓటమికి ధోనీసేనపై ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
చెన్నైపై ముంబయి ఘనవిజయం - csk vs mumbai match
షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైని చిత్తుగా ఓడించి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబయి. 115 పరుగుల ఛేదనతో బరిలో దిగిన ముంబయి.. 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని మరో గెలుపును ఖాతాలో వేసుకుంది.
యువ కెరటం ఇషాన్ కిషన్ (68; 37 బంతుల్లో 6×4, 5×6), క్వింటన్ డికాక్ (46; 37 బంతుల్లో 5×4, 2×6) కలిసి 12.2 ఓవర్లకే మ్యాచును ముగించారు. రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. ఈ గెలుపుతో 14 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో ముంబయి అగ్రస్థానానికి చేరుకోగా చెన్నై (6 పాయింట్లు) అట్టడుగున నిలిచింది.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లకు 114/9 పరుగులకే పరిమితమైంది. సామ్ కరన్ (52; 47 బంతుల్లో 4×4, 2×6) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. లేదంటే ఆ మాత్రం స్కోరైనా వచ్చేది కాదు. ధోనీసేన తన 115లోపు స్కోరుకు పరిమితం అవ్వడం ఇది తొమ్మిదో సారి.