ఐపీఎల్లో పేలవ రికార్డు కోసం పోటీ పడుతున్నట్టు ఉంటాయి ఆ జట్లు. ఇప్పటివరకూ జరిగిన 12 సీజన్లను పరిశీలిస్తే తక్కువసార్లు ప్లే-ఆఫ్స్‌కు చేరిన వాటిలో ఆ జట్లే కింద నుంచి రెండు స్థానాల్లో ఉంటాయి. జట్లు మార్చినా, సారథులను మార్చినా, కోచింగ్ సిబ్బందిని మార్చినా అవి మాత్రం నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నాయి. అవే దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. మరి ఈ సీజన్లోనైనా ప్రదర్శన మెరుగుపర్చుకుని టాప్-4లోకి అడుగుపెడతాయా?
ఎవరిది పైచేయి?
గతేడాది వీరు ఐదు మ్యాచుల్లో తలపడగా.. నాలుగింటిలో పంజాబ్‌దే పైచేయి. చివరి మ్యాచులో మాత్రం దిల్లీ గెలిచింది. ఈ సీజన్లో బలమైన బ్యాటింగ్ లైనప్, స్పిన్ దళంతో పంజాబ్‌తో ఉంది. ఈ సారైనా ప్రత్యర్థిపై దిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా? పంజాబ్ తన విజయాల పరంపరను కొనసాగిస్తుందా? ఎవరు నెగ్గుతారో? అనేది చూడాలి.
దిల్లీ క్యాపిటల్స్ బలాలు
దిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ఒక్కసారైనా గెలవలేదు. ప్రతి సీజన్లోనూ పాయింట్ల పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో ఉండే ఈ జట్టు.. గతేడాది మాత్రం మంచి ప్రదర్శన చేసింది. 12 సీజన్లలో దిల్లీ ఇప్పటివరకూ కేవలం నాలుగుసార్లు మాత్రమే ప్లే-ఆఫ్స్‌కు చేరింది. 2008, 2009 మినహాయిస్తే ఆ తర్వాత ఎప్పుడూ రెండు వరుస సీజన్లలో టాప్-4లో నిలిచిన దాఖలాలు లేవు. 2012లో ప్లే-ఆఫ్స్‌కు వెళ్లిన తర్వాత.. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాదే మళ్లీ ఆ దశకు చేరగలిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుత దిల్లీ జట్టు... ఆశలు రేపేలా కనిపిస్తోంది. దిగ్గజాలు రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ మార్గదర్శకత్వంలో 2019లో దిల్లీ క్యాపిటల్స్ స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సైతం పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.... శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టులో యువరక్తం ప్రవహిస్తోంది.
ఈ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. గత బిగ్‌బాష్ లీగ్‌లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఈసారి వేలంలో దక్కించుకుంది. ఇతడు ఈ జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. అలాగే మిడిలార్డర్లో నమ్మదగిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ కారేను తీసుకున్నారు. హెట్మెయర్ రూపంలో మరో విధ్వంసకర ఆటగాడు జట్టులో చేరాడు.
పృథ్వీ షా, శిఖర్ ధావన్ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్ జోడీ కుదిరింది. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించగలడు. అలాగే ఈసారి టాపార్డర్‌లో మరింత బలం కోసం ఎంతో అనుభవమున్న అజింక్యా రహానేను తీసుకున్నారు.
అనుభవమున్న రవిచంద్రన్ అశ్విన్ రాకతో స్పిన్ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. ఇతడికి తోడు ఇప్పటికే అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లమిచానే రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న వీరితో యూఏఈలో క్యాపిటల్స్ సత్తాచాటాలని భావిస్తోంది.
బలహీనతలు
ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడ్ ఆప్షన్లో ముంబయికి అప్పజెప్పిన దిల్లీలో ఈసారి కగిసో రబాడా మాత్రమే చెప్పుకోదగ్గ విదేశీ పేసర్. క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌ను తీసుకున్నా అతడు ఈలీగ్కు దూరమయ్యాడు. దీంతో ఇతడి స్థానంలో ఎన్రిచ్ నోట్జేను తీసుకున్నారు. కానీ ఇతడికి అంతగా అనుభవం లేదు. డేనియల్ సామ్స్ రూపంలో అన్క్యాప్డ్ ఆస్ట్రేలియా పేసర్ ఉన్నా ఇతడి అవకాశాలు రావడం కష్టమే. అలాగే ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ లాంటి భారత పేసర్లు ఉన్నా వీరి ప్రదర్శనపై పూర్తి నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు క్రీడా పండితులు.
ఆల్‌రౌండర్ విభాగంలోనూ ఈ జట్టు పేలవంగా కనిపిస్తోంది. స్టోయినిస్ మాత్రమే ఇందులో చెప్పుకోదగ్గ ఆల్‌రౌండర్. మిగతా వారిలో అక్షర్ పటేల్, డేనియల్ సామ్స్, కీమో పాల్, లలిత్ యాదవ్ ఉన్నారు. వీరంతా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ రాణించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.