బుధవారం విశాఖపట్నం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1లో హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రిషభ్ పంత్ ఎంపికయ్యాడు. ఇదే మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పృథ్వీషా సహచరుడిపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతమున్న యువ క్రికెటర్లలో పంత్ గొప్ప ఫినిషర్ అంటూ కొనియాడాడు.
"టీ20 మ్యాచ్‌ల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో మేం గెలవాలని అందరం కోరుకున్నాం. అలాంటి సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు పంత్. యువ క్రికెటర్లలో అతడు ఓ గొప్ప ఫినిషర్." -పృథ్వీ షా, దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్
పంత్‌ను ప్రశంసించిన యువ క్రికెటర్ పృథ్వీషా
ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన పృథ్వీషా.. 38 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చెన్నైతో జరిగే తర్వాతి మ్యాచ్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.
"జట్టు నాపై నమ్మకం ఉంచింది. సభ్యులందరూ నన్నెంతో ప్రోత్సాహించారు. ఆ విషయమే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు తోడ్పడింది. తర్వాతి మ్యాచ్‌లో హర్భజన్, తాహిర్ లాంటి బౌలర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. జట్టంతా ప్రణాళికలు రచిస్తోంది." -పృథ్వీ షా, దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్
మే 10న విశాఖపట్నంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది దిల్లీ క్యాపిటల్స్. ఈ రెండింటిలో గెలిచిన జట్టు హైదరాబాద్‌లో 12న ముంబయితో ఫైనల్ ఆడనుంది.