ind vs Sa World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 326 భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. స్పిన్నర్ రవీంద్ర జడేజా దెబ్బకు 27.1 ఓవర్లలో 83 పరుగులకే చేతులెత్తేసింది. సఫారీ జట్టులో ఏ బ్యాటర్ కూడా 15 పరుగుల మార్క్ అందుకోలేదు. మార్కో జాన్సన్ (14 పరుగులు) ఆ జట్టులో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, మహ్మద్ షమీ 2, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీకే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
జడ్డూ మ్యాజిక్..327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. సిరాజ్ అద్భుత బంతితో తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్ (5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత సఫారీ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. పిచ్‌ను అంచనా వేసిన కెప్టెన్ రోహిత్.. పవర్ ప్లే లోనే స్పిన్నర్ రవీంద్ర జడేజాకు బంతినిచ్చాడు. 8.3 ఓవర్ వద్ద జడ్డూ.. బవూమా (11)ను బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. తర్వాత కాసేపు షమీ సఫారీలను శాసించాడు. అతడు స్పల్ప వ్యవధిలోనే మార్క్రమ్ (9), వాన్‌డర్ డస్సెన్ (13)ను వెనక్కిపంపాడు.
ఆ తర్వాత జడేజా తేమగా ఉన్న పిచ్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ.. సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బందుల్లోకి నెట్టాడు. వారికి పరుగులు చేయడం అటుంచితే.. జడ్డూ బంతులను ఎదుర్కోవడమే ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే జడేజా.. ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. మిల్లర్ (11), కేశవ్ మహరాజ్ (7), రబాడా (6) ను ఔట్ చేశాడు. ఇక ఆఖర్లో ఎంగ్డీ వికెట్ పడగొట్టిన కుల్దీప్.. టీమ్ఇండియాకు ఘనమైన విజయాన్ని కట్టబెట్టాడు.