India Vs Pak Asia Cup 2023 : 2023 ఆసియా కప్‌లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ జరుగుతున్న శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తీవ్రంగా అంతరాయం కలిగించింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ పూర్తైన తర్వాత వర్షం జోరు అధికమైంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్లు కుదించడం కూడా సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఘనమైన ఆరంభమేమీ దక్కలేదు. పాక్ బౌలర్ షహీన్ భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (11), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4)ను షహీన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (14), శుభ్‌మన్ గిల్ (10) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక మిడిలార్డర్లో వచ్చిన ఇషాన్ కిషన్ (82), హార్దిక్ పాండ్య (87) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో జడేజా (14), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపర్చారు. పేస్ బౌలర్ బుమ్రా (16) విలువైన పరుగులు సాధించాడు. దీంతో భారత్ 48.5 ఓవర్లకు 266 పరుగులు చేలి ఆలౌటైంది. ఇక పాక్ బౌలర్లలో షహీన్ 4, హారిస్, నజీమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అయితే మ్యాచ్‌లో అన్ని వికెట్లు పేసర్లకే దక్కడం విశేషం..