కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టుపై(IND vs ENG 5th Test) క్లారిటీ వచ్చేసింది. ఈ టెస్టు మ్యాచ్‌ను వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB News) తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగనున్నట్లు తెలిపింది.
"భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సిరీస్ చివరి టెస్టు మ్యాచ్ వచ్చే ఏడాది జులై 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మధ్య అంగీకారం కుదిరింది" అని ఈసీబీ స్పష్టం చేసింది.
మాంచెస్టర్(Manchester Test) వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఈసీబీ ప్రస్తుతం వేదికను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం అప్పటికే టికెట్లు కొన్నవారికోసం తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు ఈసీబీ తెలిపింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వీలుకాని అభిమానులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే ఏర్పాట్లు కూడా ఎడ్జ్‌బాస్టన్ మైదానం యాజమాన్యం చూసుకుంటుందని పేర్కొంది.