టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటకు ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు. మైదానంలో మహీ హెలికాప్టర్ షాట్లు కొడితే ప్రేక్షకులు ఆనందంతో గెంతులు వేస్తారు. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంతో ఇష్టం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాహనాల్లో తనకు నచ్చిన వాటిని సేకరిస్తూ ఉండటం మాహీకి సరదా.
టీమ్ఇండియా దాదాపు 14 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఇంట్లో చాలా లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. ఫెరారీ 599 జీటీఓ, యమహా ఆర్డీ 350 ఇలా తదితర వాహనాలు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటిని కొనడమే కాదు, వాటి యంత్ర భాగాల అమరిక గురించీ ధోనీకి క్షుణ్నంగా తెలుసు .
10కిపైగా కార్లు..
లగ్జరీ కార్లపై ధోనీకి ఉన్న ప్రేమ అతని అభిమానులకు సుపరిచితమే. ఇప్పటి వరకు సుమారు 10కార్లకు పైగా సేకరించాడు. వీటిలో ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్ హెచ్2, జీఎంసీ సియెర్రా సహా పలు అత్యాధునిక కార్లకు మాహీ యాజమాని. 2019లో ధోనీ గ్యారేజీలో చేరిన జోంగా అనే వాహనాన్ని భారత సైన్యంలో ఉపయోగిస్తారు.
బైక్‌లంటే అమితమైన ప్రేమ...
టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు కార్లే కాదు, బైక్‌లన్నా యమ మోజు. వీటిలో ధోనీకి ఎంతో ఇష్టమైన బైక్ రాజ్‌దూత్ ఆర్డీ 350. ఇప్పటివరకు తన సేకరణలో ఈ రకమైన బైక్‌లను ఒకటి కంటే ఎక్కువే కొన్నాడు. కాన్ఫెడరేట్ హెల్కాట్ ఎక్స్ 32, హార్లే డేవిడ్సన్ ఫాట్‌బాయ్, బీఎస్ఏ గోల్డ్ స్టార్, కవాసకి నింజా జెడ్ఎక్స్ 14 ఆర్, యమహా ఎఫ్‌జెడ్1, డుకాటీ 1098, తాజాగా కవాసకి నింజా హెచ్ 2 వంటి అద్భుతమైన బైక్ మోడళ్లు ధోనీ సొంతం.
2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు.. గతేడాది తన జట్టును నాలుగోసారి విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలయ్యే కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.