Deepak Chahar Comeback: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కీలక బౌలర్ దీపక్ చాహర్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వేలంలో రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను తిరిగి దక్కించుకున్న చెన్నై అతడి సేవల కోసం ఎదురు చూస్తోంది. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన చెన్నై.. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్‌ల్లో చెన్నైకి చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. గత సీజన్లో చెన్నై విజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించిన దీపక్.. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు.
ఈ ఐపీఎల్ టోర్నీ మొదలవడానికి రెండు రోజుల ముందు.. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. రవీంద్ర జడేజా కొత్త సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడటం ప్రతికూలాంశం. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగి లఖ్‌నవూ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. గెలవలేకపోయింది. బౌలింగ్‌లో తేలిపోయింది. బ్యాటింగ్‌లో ఉతప్ప, ధోనీ, శివం దూబే ఫర్వాలేదనిపిస్తున్నా.. గతేడాది ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ గాడినపడాల్సి ఉంది. బౌలింగ్ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఆదివారం చెన్నై తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబయి బ్రబౌర్న్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.