కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి వచ్చిన రాధా.. ప్రస్తుతం మైదానంలో వికెట్ల సాగు చేస్తోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం పొందని ఈ అమ్మాయి.. మూడో మ్యాచ్‌లో వచ్చిన ఛాన్స్‌ను ఒడిసి పట్టుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడమే కాకుండా 14 పరుగులు చేసింది. అంతేకాకుండా రెండు అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్ పోరులోనూ.. తన లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్‌తో నాలుగు వికెట్లు కూల్చి జట్టును విజయపథంలో నడిపించింది. ఈ ప్రదర్శనలతో రాధ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
మంచి స్పిన్ నైపుణ్యాలతో ఆకట్టుకున్న ఈ అమ్మాయిది ముంబయి. ఆమె చిన్నప్పుడు తండ్రి కూరగాయలు అమ్మితేనే కుటుంబం గడిచేది. ఆమెకు ఇద్దరు సోదరులు. క్రికెట్ ఆడాలనే తన ఇష్టానికి పేదరికం అడ్డుపడింది. కానీ కోచ్ ప్రఫుల్ నాయక్ వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది.
అలా మొదలైంది..
2012లో తన మిత్రులతో కలిసి పదకొండేళ్ల రాధ క్రికెట్ ఆడుతోంది. అక్కడికి తన మేనకోడలు ఆట చూద్దామని వచ్చిన అప్పటి కోచ్ ప్రఫుల్ దృష్టి రాధ మీద పడింది. ఎంతసేపటికీ ఔట్ కాకుండా ఆడుతున్న ఓ అబ్బాయి వికెట్ తీసిన ఆమెలో ప్రతిభ ఉందని అతడు గుర్తించాడు. రాధను అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆమె తండ్రిని కలిసేందుకు వెళ్లాడు. కానీ పేదరికంలో ఉన్న అతడు.. కూతురు ఆట కోసం డబ్బు పెట్టే పరిస్థితుల్లో లేడు. క్రికెట్లో రాణిస్తే రైల్వేలో ఉద్యోగం సంపాదించే అవకాశముందని ఆమె తండ్రికి చెప్పి... ప్రఫుల్ అతడిని ఒప్పించాడు. ఇక అక్కడి నుంచి ఆమె క్రికెట్ ప్రయాణం మొదలైంది.