బ్యాట్స్‌మెన్‌గా దూకుడు.. అమ్మాయిలకు కలల రాకుమారుడు... మైదానంలో ప్రత్యర్థులతో మాటల తూటాలు.. సారథిగా అత్యధిక విజయాలు.. చిన్నవయసులోనే అంతులేని రికార్డులు.. ఇన్ని అద్భుతాలు టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ సొంతం. అరుదైన ఘనతలతో సగటు ప్రేక్షకుడి దగ్గరి నుంచి క్రికెట్ అభిమాని వరకు అందరూ మెచ్చిన క్రికెట్ వీరుడు ఈ వీరాటుడు.. ఈ రోజు భారత సారథి పుట్టినరోజు సందర్భంగా.. కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు...
ఛేదనలో మొనగాడు..
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడంటే అతిశయోక్తి లేదు. అతడు చేసిన మొత్తం శతకాల్లో.. ఛేదనలో చేసినవే ఎక్కువ. వీటన్నింటిలో 2012లో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన త్రైపాక్షిక మ్యాచ్ హైలెట్. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 321 పరుగులు చేసింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా 40 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ మ్యాచ్‌లో విరాట్ వీర విహారం చేశాడు. 86 బంతుల్లో 133 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.
ఈ రికార్డులన్నీ పక్కన పెడితే విరాట్ కోహ్లీకి కుటుంబంతో అనుబంధం ఎక్కువే. ముఖ్యంగా తన తండ్రి ప్రేమ్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం.
తండ్రి ప్రేమ్ కోహ్లీతో విరాట్ కోహ్లీ తండ్రి మృతి.. అదే రోజు మ్యాచ్
2006 డిసెంబరు 18న ఉదయం 2.30 గంటల ప్రాంతంలో విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించాడు. అప్పటికే రెండు రోజుల నుంచి దిల్లీ - కర్ణాటక మధ్య మ్యాచ్ జరుగుతోంది. కానీ తండ్రి మరణంతో విరాట్ పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఆడాలనే నిర్ణయించుకున్నాడు కోహ్లీ. ఇంటి దగ్గర తండ్రి మృతదేహం ఉన్నా.. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో మ్యాచ్‌కు హాజరయ్యాడు. 90 పరుగులు చేసి 281 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. ఔటైన తర్వాత గానీ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ మ్యాచ్‌లో విరాట్ ఇన్నింగ్స్ వల్ల దిల్లీ ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది.
కోహ్లీ జెర్సీ- ఆ నెంబర్ ఎలా వచ్చిందంటే....
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అని అందరికి తెలుసు. కోహ్లీ తండ్రి డిసెంబరు 18న మరణించారు. అప్పటికీ కోహ్లీ వయసు 18. తన తండ్రి జ్ఞాపకార్థం అప్పటి నుంచి 18వ నెంబర్ గల జెర్సీని వాడుతున్నాడు.
'కోహ్లీ' ప్రత్యేకతలు..
- 22 ఏళ్ల కంటే ముందే వన్డేల్లో రెండు శతకాలు చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతడికంటే ముందు సచిన్ తెందూల్కర్, సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.
- ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి అదరగొట్టాడు విరాట్. ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 175 పరుగులు చేశాడు.
- వన్డేల్లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డూ కోహ్లీ పేరిటే ఉంది. 2012 ఆసియా కప్‌లో 148 బంతుల్లో 183 పరుగులతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో అతడి అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకుముందు విండీస్ మాజీ క్రికెటర్ లారా(156) పేరిట ఈ రికార్డు ఉండేది.
- 23 ఏళ్లకే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం సొంతం చేసుకున్నాడు విరాట్. 2012లో ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వేగంగా 1000, 2000, 3000, 4000, 5000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో వేగంగా 7000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ ఘనత సాధించాడు.
- అనుష్క శర్మను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు విరాట్. 2018లో వీరి వివాహం జరిగింది. అయితే బాలీవుడ్ కరిష్మా కపూర్ కోహ్లీ తొలి క్రష్ అట. చిన్నతనంలో ఆమె కోసం ఎంతో పరితపించేవాడంట.