బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో డా.రూపాలీ బసు వెల్లడించారు. కానీ త్వరలోనే అతనికి మరో యాంజియోప్లాస్టీ చేయక తప్పదని మంగవారం స్పష్టం చేశారు.
మంగళవారం కోల్కతా చేరుకున్న గుండె సంబంధిత వ్యాధి నిపుణులు డా. దేవీ శెట్టి.. గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 9 మంది వైద్యులతో కూడిన బృందాన్ని కలిసి.. గంగూలీని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంట్లో చేయాల్సిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
"గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. గత రాత్రి బాగా నిద్రపోయారు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వలేదు. డాక్టర్లు తరచుగా ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు (మంగళవారం) ఉదయం గుండె సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ దేవీ శెట్టి ఆస్పత్రికి చేరుకుని.. గంగూలీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోసారి యాంజియోప్లాస్టీ చేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
గుండెపోటుతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గత శనివారం ఆసుపత్రిలో చేరగా.. అతని గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించిన వైద్యులు అందులో ఒకదాన్ని తొలగించడం కోసం స్టెంట్ వేశారు. బుధవారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటికి వెళ్లాక కూడా గంగూలీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:'బుధవారం గంగూలీ డిశ్చార్జ్'