యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సంజు సరైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ చెన్నైతో తలపడింది. అందులో సంజు 32 బంతుల్లోనే 9 సిక్సర్లు కొట్టి 74 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెల్చింది.
సంజు టీమ్‌ఇండియాలో లేడా?: షేన్ వార్న్
టీమ్‌ఇండియాలో సంజూ శాంసన్ లేకపోవడం తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుందని షేన్ వార్న్ చెప్పాడు. అతడు ఫామ్ కొనసాగిస్తే ఈసారి ఐపీఎల్ టైటిల్ రాజస్థాన్ గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
'సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. నేను చాలా రోజుల నుంచి అంటున్నదే మళ్లీ అంటున్నా.. అతను భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో రాణించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్. పెద్ద బ్యాట్స్‌మన్‌కే కష్టమైన షాట్లు సైతం అలవోకగా బాదగలడు. చాలాకాలం నుంచి అతడిని గమనిస్తూనే ఉన్నా. అతడు టీమ్‌ఇండియాలో లేకపోవడం నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది' అని వార్న్ పేర్కొన్నాడు. సంజూ ఇలాగే రాణిస్తే రాజస్థాన్ జట్టు టైటిల్ గెలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలోనే అతడిని భారత జెర్సీలో చూస్తానని భావిస్తున్నానని అన్నాడు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత వికెట్ కీపర్ కోసం చాలామంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. అందులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ టీ20 సీజన్‌లో సంజూ ఇదే ఫామ్ కొనిసాగించి టీమ్ ఇండియాలోకి వచ్చినా రావొచ్చు!