అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్లు.. అదే సిరీస్‌లో శతకంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'... వేగంగా 300 వికెట్లు తీసిన మైలురాయి.. ఈ రికార్డులు సాధించింది ఎవరో కాదు.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ దశాబ్దంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు (564) తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.
అశ్విన్.. అత్యధిక వికెట్లు
2010 జనవరి నుంచి ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 564 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు అశ్విన్. టెస్టుల్లో 362, వన్డేల్లో 150, టీ20ల్లో 52 వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్ 535, స్టువర్ట్ బ్రాడ్ 525 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్ కూడా టాప్-5లో చోటు దక్కించుకున్నారు.
అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్లు..
2011లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసినప్పటి నుంచి అశ్విన్ వికెట్ల దాహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పొడి పిచ్‌లపై తన స్పిన్ మయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను తికమక పెడతాడు. అరంగేట్ర టెస్టులో 5 వికెట్లు తీసిన ఏడో భారత క్రికెటర్‌గా ఈ చెన్నై బౌలర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అదే సిరీస్‌లో శతకంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు కూడా దక్కించుకున్నాడు.