దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యే అవకాశముంది. తీవ్ర అనారోగ్యంతో అతడి తండ్రి గెడ్ స్టోక్స్ బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అందుకే బెన్ స్టోక్స్ మంగళవారం తండ్రి దగ్గరే ఆస్పత్రిలోనే ఉండిపోయాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది.
ఇంగ్లాండ్ ట్రైనింగ్ సెషన్‌కు బెన్ స్టోక్స్ రాలేకపోయాడు. అతడి తండ్రి గెడ్ స్టోక్స్ అనారోగ్యంతో ఉన్నందున అక్కడే ఉండిపోయాడు. బెన్ కుటుంబానికి ఈసీబీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వారి ఏకాంతాన్ని భంగం కలిగించవద్దని ప్రజలను కోరుకుంటున్నాం -ఈసీబీ ప్రకటన
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రిటోరియా సమీపంలోని సెంచూరియన్‌లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. బీబీసీ 'స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' గా ఎంపికైన స్టోక్స్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: పీసీబీ ఛైర్మెన్‌కు అలా మాట్లాడే హక్కే లేదు: అరుణ్