ఐదు టీ20ల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన న్యూజిలాండ్... వన్డే సిరీస్‌లో అనూహ్యంగా పుంజుకుంది. అదే 5 టీ20ల్లో ఘన విజయాలు సాధించిన భారత్... డీలా పడింది. ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌ను గుర్తుచేస్తూ.. మరోసారి టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో 22 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలమై.. ఓటమిపాలైంది.
బౌల్డ్.. బౌల్డ్.. బౌల్డ్..
నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాకిచ్చాడు బెనెట్. 21 పరుగుల స్కోరు వద్ద మయాంక్(3)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ పృథ్వీషా(24) జెమీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కేవలం 13 పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు ఔటవడం వల్ల భారత్ కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న 'కింగ్ ఆఫ్ చేజ్' విరాట్ కోహ్లీ 15 పరుగులకే వెనుదిరిగాడు. 53 పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
శ్రేయస్ పోరాడినా...
మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. కేదార్(9) మరోసారి విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ ఒంటరి పోరాటం చేస్తూ కెరీర్లో మరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే బెనెట్ వేసిన 27వ ఓవర్లో ఔట్ అయ్యాడు శ్రేయస్(52).