లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్-13వ సీజన్ వాయిదా పడింది. ఫలితంగా ఆటగాళ్లకు మంచి విశ్రాంతి దొరికింది. ఈ సమయాన్ని కొందరు కుటుంబసభ్యులతో ఆస్వాదిస్తుండగా.. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సహచరులు, స్నేహితులతో లైవ్‌సెషన్లు నిర్వహించి అనేక ఆసక్తికర ఘటనలు, విషయాలు పంచుకుంటున్నారు. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సైతం ఎప్పటికప్పుడు తమ పోస్టులతో అభిమానులకు చేరువగా ఉంటున్నాయి.
తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ'కెప్టెన్ దినేశ్ కార్తిక్‌తో' ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'టోటల్లీ స్టంప్డ్ బై డీకే' అనే కార్యక్రమానికి అతడిని వ్యాఖ్యాతగా చేసి వీడియో సెషన్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే డీకే తొలి ఎపిసోడ్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్‌తో కలిసి నిర్వహించాడు. ఈ సంభాషణలను కేకేఆర్ టీమ్ ట్విటర్‌లో పంచుకుంది.
సరదాగా సాగిన చిట్‌చాట్..
ఈ కార్యక్రమంలో తొలుత డీకేని చూసిన ఆండ్రూ రసెల్ ఆశ్చర్యపోయాడు. అతడి జుట్టు, గడ్డం చూసి నమ్మలేకపోయాడు. "నీ క్షురకుడికి ఏమైంది?" అని సరదాగా టీజ్ చేశాడు. రసెల్ మాటలకు డీకే, నరైన్ నవ్వుకున్నారు. తర్వాత డీకే స్పందిస్తూ భారత్‌లో లాక్‌డౌన్ వేళ అత్యవసర పనులకే అనుమతించారని వివరించే ప్రయత్నం చేశాడు. దీనికి రసెల్ మళ్లీ కౌంటర్ ఇచ్చాడు. "రేజర్ బ్లేడ్ తెచ్చుకోడానికి కూడా అనుమతించట్లేదా?" అని చమత్కరించాడు. చివరగా డీకే కొత్త లుక్ బాగుందని, తనకు నచ్చిందని రసెల్ పేర్కొన్నాడు.
అనంతరం సునీల్ నరైన్ స్పందిస్తూ ఈ కొత్త లుక్‌ను ఐపీఎల్‌లో కొనసాగించాలని చెప్పాడు. తర్వాత కార్తిక్ అందుకొని రసెల్‌ను ఆటపట్టించాడు. నీకు హెలికాఫ్టర్ కొనాలని ఉందట నిజమేనా? అని అడిగాడు. దానికి స్పందించిన బిగ్ హిట్టర్.. హెలికాఫ్టర్ కాదని, తనకు ఎగిరే కారు కొనాలని ఉందని తెలిపాడు. ఎగిరే కారుంటే ట్రాఫిక్ బెడద లేకుండా ప్రయాణించొచ్చని రసెల్ వివరించాడు.
ఇదీ చూడండి:కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ