టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌లో ఓ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మాజీ, ప్రస్తుత అంతర్జాతీయ బౌలర్లలో ఆరుగురి బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు. ఈ వీడియోను ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ఎవరెవరి బౌలింగ్‌ను అతడు అనుకరించాడో గుర్తుపట్టమని అభిమానులను అడిగింది. దీనికి స్పందించిన ముంబయి అభిమానులు అనేక మంది అంతర్జాతీయ బౌలర్ల పేర్లను కామెంట్లలో పేర్కొంటున్నారు.
బుమ్రా ఒక్కడే.. ఆరుగురిలా బౌలింగ్! - Jasprit Bumrah bowling actions
ఐపీఎల్ కోసం చేస్తున్న ప్రాక్టీసులో భాగంగా ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆరుగురి బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతమైన లైక్‌లను అందుకుంటోంది.
గతేడాది ముంబయి ఇండియన్స్ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందుకోసమే ఆటగాళ్లు నెట్ ప్రాక్టీసుల్లో గంటలకొద్దీ చెమట చిందిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా ఇలా ప్రత్యేకంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
కాగా ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయమై ఆ ఫ్రాంచైజీ గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ఉంగరాలు అందించింది. అందరూ కచ్చితంగా వాటిని ధరించాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, కరోనా లక్షణాలు లేకుండా వైరస్ బారిన పడినా శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతుంది.