టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. ఒక్క వికెట్ కోల్పోకుండా 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కంగారూ జట్టు. ఓపెనర్లు వార్నర్(128*), ఫించ్(110*) మ్యాచ్‌ను ముగించేశారు. వాంఖడేలో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం అంగీకరించాడు. ఆ విషయం తమ బ్యాటింగ్ అప్పుడే అర్థమైందని కోహ్లీ తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మేం అతి జాగ్రత్తగా ఆడాం. అదే మా కొంప ముంచింది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుతో అలా ఆడాల్సింది కాదు. టీమిండియా ఇప్పుడు కోలుకోవాల్సిన సమయం. అయితే, ఈ రోజు మాత్రం ఆస్ట్రేలియాకే క్రెడిట్ దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడూ వెల కట్టలేనిది. ఈ రోజు మేం ఏ సందర్భంలోనూ ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయించలేకపోయాం".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు భారత్‌ను దెబ్బ తీశాయి. ముగ్గురు ఓపెనర్లు (రాహుల్, రోహిత్, ధావన్)లను జట్టులో ఆడించడం కోసం చేసిన ప్రయోగం ఫలించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం కెప్టెన్ కోహ్లీ తాను ఎప్పుడూ వచ్చే మూడో స్థానాన్ని వదులుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ మూడో స్థానంలో రాగా.. విరాట్ నాలుగులో వచ్చాడు. ఈ అంశంపైనా స్పందించాడు కోహ్లీ.
"నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై గతంలో చాలాసార్లు చర్చించాం. రాహుల్ రాణిస్తుండం వల్ల అతడిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాం. కానీ ఈ మార్పు సత్ఫలితాన్ని ఇచ్చిందని అనిపించడం లేదు. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సి ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి పరీక్షిస్తున్నాం. ఒక మ్యాచ్ ఓటమితో భయపడాల్సిన అవసరం లేదు. ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కోసారి వైఫల్యం తప్పదు. బలమైన ఆసీస్‌పై బాగా ఆడకపోతే మూల్యం చెల్లించక తప్పదు. బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు"