తెలంగాణ

telangana

స్వదేశంలో సఫారీలపై టీమిండియా కప్పు కొట్టేనా..?

By

Published : Sep 22, 2019, 6:02 AM IST

Updated : Oct 1, 2019, 1:02 PM IST

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో టీ20 జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక. ఇప్పటికే సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా...చివరి మ్యాచ్​లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. స్వదేశంలో సఫారీలపై తొలిసారి టీ20 సిరీస్​ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది.

సఫారీలకు మూడో టీ20లో ముచ్చెమటలేనా..?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్​Xదక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి టీ20 జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... ఈ మ్యాచ్​లోనూ అదరగొట్టాలని భావిస్తోంది. కొత్త ముఖాలతో టీమిండియాకు పోటీనివ్వలేక చతికిలపడిన సఫారీ జట్టు.... చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. మ్యాచ్​ రాత్రి 7గంటలకు ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు సఫారీలతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్​ల్లో కప్పు గెలవలేదు భారత జట్టు. ఇప్పుడు తొలిసారి ఆ ఘనత సాధించేందుకు అవకాశం వచ్చింది. మరి ఈ పోరుకు సిద్ధమవుతున్న ఇరుజట్ల గురించి ఓసారి చూద్దాం.

విరాట్‌ దూకుడు...

రెండో టీ20లో విరాట్‌ కోహ్లీ (72*) తనదైన ఫామ్​తో చెలరేగాడు. టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్​ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి వచ్చి సఫారీ బౌలర్లను ఆడుకున్నాడు. గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసిన రోహిత్‌ ఈ సారి విజృంభించి ఆడాలని పట్టుదలతో ఉన్నాడు.

  1. యువ బ్యాట్స్​మెన్​ రిషభ్ పంత్​ ఈ మ్యాచ్​లో నిరూపించుకోవాల్సి ఉంది. చెత్త షాట్లు ఆడి ఔటవడం వల్ల అతడి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నా.. అతడి ప్రతిభ, విధ్వంసం సృష్టించగల సామర్థ్యాలను చూసి కాస్త ఓపిక పట్టాలని గంగూలీ వంటి మాజీలు సూచిస్తున్నారు.
  2. పొట్టి ప్రపంచకప్‌కు ఏడాది సమయమే ఉండటం వల్ల మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ను పరీక్షిస్తోంది టీమిండియా. అతడు నిలకడ ప్రదర్శన చేశాడు. హార్దిక్‌, జడేజా ఆల్​రౌండర్​ ప్రదర్శనతో మంచి జోష్​ మీద ఉన్నారు.
  3. యువ బౌలర్లు దీపక్​ చాహర్‌, వాషింగ్​టన్​ సుందర్‌ ఆకట్టుకుంటున్నారు. నవదీప్‌ సైని వేగంగా, తెలివిగా బంతులు వేస్తున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ కొత్తబంతితో మంచి స్పిన్​ రాబడుతున్నాడు.

డికాక్​ అదుర్స్​...

క్వింటన్ డికాక్ సారథ్యంలో ప్రొటీస్ జట్టు భారత్​తో అమితుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్​లో డికాక్‌, తెంబా బవుమా గత మ్యాచ్​లో అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరూ భారత బౌలర్లను బాగానే ఎదుర్కొన్నారు. సీనియర్లు డేవిడ్‌ మిల్లర్‌, రెజా హెండ్రిక్స్‌, డసెన్​ బ్యాటింగ్‌ భారం మోయాల్సి ఉంది.

  1. బలమైన బౌలింగ్​ లైనప్​గా పేరున్న దక్షిణాఫ్రికా జట్టు గత మ్యాచ్​లో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా టీమిండియాపై మంచి పట్టున్న రబాడా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
  2. ఫెలుక్వాయో, నోర్త్​జే నిలకడైన ప్రదర్శన చేస్తే భారత్​కు కష్టమే. గత మ్యాచ్​లో స్పిన్నర్లను ఆలస్యంగా ఉపయోగించిన డికాక్‌.. బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు.

ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది.మొహాలీలో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇదే ఊపులో చివరి పోరులో నిలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే మూడో మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

ఇరు జట్లు (అంచనా)...

భారత్‌:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్​ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని

దక్షిణాఫ్రికా:

క్వింటన్‌ డికాక్‌ (సి), డుసెన్‌, తెంబా బవుమా, జూనియ్‌ డాల, ఫోర్టూయిన్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, రెజా హెండ్రిక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, నోర్జె, ఫెలుక్‌వాయో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, రబాడ, శంషీ, జేజే స్మట్స్‌

Last Updated : Oct 1, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details