తెలంగాణ

telangana

భారత్​-బంగ్లా: తొలి టెస్టులో రికార్డులివే

By

Published : Nov 16, 2019, 6:26 PM IST

ఇండోర్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పలు రికార్డులను బ్రేక్​ చేసిన భారత జట్టు.. రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత్​-బంగ్లా: తొలి టెస్టులో రికార్డులివే...

ఇండోర్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్​. కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది కోహ్లీసేన. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (64; 150 బంతుల్లో 7ఫోర్లు) ఒక్కడే ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ షమీ (4/31), అశ్విన్‌ (3/42), ఉమేశ్‌ యాదవ్‌ (2/51) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇషాంత్‌కు ఒక వికెట్‌ దక్కింది.

విజయోత్సాహంతో టీమిండియా

1. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో భారత్​ దూసుకెళ్తోంది. అగ్రస్థానంలో ఓటమి ఎరుగకుండా కొనసాగుతోంది.
భారత్​ -300 పాయింట్లు( ఆరు మ్యాచ్​ల్లో ఆరు విజయాలు), న్యూజిలాండ్​ -60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), శ్రీలంక- 60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), ఆస్ట్రేలియా- 56 పాయింట్లు( రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), ఇంగ్లాండ్​- 56 పాయింట్లు(రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), వెస్టిండీస్​ (రెండు ఓటములు), దక్షిణాఫ్రికా(మూడో ఓటములు), బంగ్లాదేశ్​( ఒక ఓటమి)లతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. పాకిస్థాన్​ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ ఆడలేదు.

2. తాజా విజయంతో ధోనీ టెస్టు ఇన్నింగ్స్​ విజయాల రికార్డును బ్రేక్​ చేశాడు కోహ్లీ. విరాట్​ 10 మ్యాచ్​లు గెలిచి.. మాజీ సారథి ధోనీ(9)ని రెండో ర్యాంక్​కు నెట్టాడు. అజారుద్దీన్​(8), గంగూలీ(7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

3. స్వదేశంలో వరుసగా కోహ్లీసేనకు ఇది మూడో ఇన్నింగ్స్​ టెస్టు విజయం. పుణె వేదికగా దక్షిణాఫ్రికాపై(ఇన్నింగ్స్​ 137 పరుగులు), రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాపై (ఇన్నింగ్స్​ 202 పరుగులు) తేడాతో గెలిచింది భారత్​. తాజాగా బంగ్లాపై(ఇన్నింగ్స్​ 130 పరుగులు) తేడాతో విజయం సాధించిది టీమిండియా. 1992/93, 1993/92 తర్వాత ఈ సీజన్‌లో భారత్‌ వరుసగా మూడోసారి ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం.

4. తాజా గెలుపుతో వరుసగా ఆరో విజయం( దక్షిణాఫ్రికా 3, విండీస్​ 2, బంగ్లా 1) నమోదు చేసింది కోహ్లీసేన. 2013లో ధోనీ( ఆస్ట్రేలియాపై 4, విండీస్​పై 2 విజయాలు) సాధించిన రికార్డు ఇప్పుడు సమమైంది.

5. తొలిటెస్టులో 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు షమీ. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అతడికిది మూడో వ్యక్తిగత అత్యుత్తమం.

6. ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన నాలుగో సారథిగా రికార్డులకెక్కాడు కోహ్లీ. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ అలెన్​ బోర్డర్​ (32 విజయాలు)సరసన నిలిచాడు. దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్​ స్మిత్​(109 మ్యాచ్​ల్లో 53 విజయాలు), రికీ పాంటింగ్​(77 మ్యాచ్​ల్లో 48 విజయాలు), స్టీవ్​వా(57 మ్యాచ్​ల్లో 41 విజయాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

7. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ టాప్‌ స్కోరర్‌(105 బంతుల్లో 43 పరుగులు )గా నిలిచిన ముష్ఫికర్‌.. రెండో ఇన్నింగ్స్‌ల్లో కూడా ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 150 బంతులు ఆడిన రహీమ్‌.. 64 రన్స్​ సాధించాడు. ఈ విధంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసి ఆటగాడిగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వందకు పైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు.

8. టెస్టుల్లో భారత్​పై అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ముష్ఫికర్​ రహీమ్​. ఇప్పటివరకు మహ్మద్ అష్రాఫుల్(386 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్​ చేసి మూడో స్థానం కైవసం చేసుకున్నాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​ అయ్యాడు.

9. ఇరుజట్ల పరంగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్​ తెందూల్కర్(820) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్​ ద్రవిడ్(560) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ముష్ఫికర్ సగటు 55 ఉండటం విశేషం. భారత్​తో ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన ముష్పికర్... మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్​ల్లో రెండు సెంచరీలు సాధించాడు.

ఆసక్తికరంగా...
బంగ్లా ఓపెనర్ల ప్రదర్శన నిరాశపర్చినా.. ఇద్దరూ ఒకే వ్యక్తిగత స్కోరు, ఒకే బౌలర్ల చేతిలో ఔటవ్వడం ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో షాద్​మన్​ 24 బంతుల్లో 6 పరుగులు చేయగా, ఇమ్రుల్‌ 18 బంతుల్లో 6 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వీరిద్దరూ అదే వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడం విశేషం. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లోనూ షాద్​మన్ 24 బంతులే ఆడి ఆరు పరుగులు చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details