భారత యువ ఆటగాడు హనుమ విహారి భవిష్యత్ ప్రణాళికలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. ఈ సీజన్‌లో ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్న అతని ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కౌంటీల్లో ఆడేందుకు విహారి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కరోనా కారణంగా జట్టుతో ఒప్పంద ప్రక్రియ నిలిచిపోయింది.
"ఈ సీజన్‌లో కౌంటీల్లో ఆడదామనుకున్నా. ఒప్పందం పూర్తయ్యాకే జట్టు వివరాలు చెప్పగలను. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతానికి ఒప్పంద ప్రక్రియ నిలిచిపోయింది. అది నియంత్రణలోకి వచ్చాక కౌంటీలు ఆడగలను. ప్రస్తుతం తమిళనాడు లీగ్‌లో నెల్సన్ సీసీకి ఆడుతున్నా. మంగళవారం అజేయ డబుల్ సెంచరీ (202 నాటౌట్) సాధించాను. నెల్సన్‌కు పనిచేస్తున్నా కాబట్టి వీలుచిక్కినప్పుడల్లా ఆ జట్టుకు అందుబాటులో ఉంటా."
-విహారి, టీమిండియా ఆటగాడు
కరోనా నేపథ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత పోటీ క్రికెట్‌పై ఆలోచిస్తానని విహారి చెప్పాడు. న్యూజిలాండ్ సిరీస్ గురించి మాట్లాడాడు.
"క్రైస్ట్‌చర్చ్ టెస్టులో ఆడిన ఇన్నింగ్స్ (55 పరుగులు) ఉత్తమమైందని చెప్పలేను. ఆ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం లభించలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో పరుగులు రాబట్టడం ఆనందమే. కానీ జట్టు గెలిచినప్పుడే ఆ ఇన్నింగ్స్‌కు విలువ. నా టెక్నిక్‌పై నాకు నమ్మకముంది. విదేశీ గడ్డపై నేను సత్తాచాటగలనన్న నమ్మకం జట్టుకుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం వల్లే ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లలో 4 అర్ధ సెంచరీలు చేయగలిగా. జట్టు కోరుకున్న స్థానంలో.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలను. 2020 నవంబరు నుంచి 2021 ఫిబ్రవరి వరకు సొంతగడ్డపై 9 టెస్టులు జరుగనున్నాయి. ఆ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభిస్తుందని అనుకుంటున్నా."
-విహారి, టీమిండియా ఆటగాడు
ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండటం తన పని అని చెప్పుకొచ్చాడు విహారి. మ్యాచ్‌లు లేనప్పుడు వ్యక్తిగత ప్రాక్టీస్ ఉంటుందని తెలిపాడు.