సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్) సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఏంటి ఇది చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారా? టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ భార్య కదా ఆమె? ఇలా రాశారేంటి అనుకుంటున్నారా? అవును మీరు చూసింది నిజమే. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఇదే సమాచారం చూపిస్తోంది. కావాలంటే మీరు కూడా 'రషీద్ ఖాన్ వైఫ్' అని సెర్చ్ బార్లో టైప్ చేస్తే అనుష్క శర్మ పేరు, ఫోటోలు కనిపిస్తాయి.
'రషీద్ ఖాన్ వైఫ్' అని గూగుల్లో టైప్ చేసే ఏమి కనపడుతోంది?
'రషీద్ ఖాన్ వైఫ్' అని గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేయగానే తొలుత అనుష్క శర్మ పేరు కనపడుతుంది. ఆ తర్వాత రషీద్ గురించి బయోగ్రఫీ ఉంటుంది. అందులో అతడికి పెళ్లి అయ్యిందని కనపడుతుంది. భార్య పేరు అనుష్క శర్మ అని రాసి ఉంటుంది. అయితే వీరిద్దరి వివాహ తేదీ మాత్రం విరాట్-అనుష్క పెళ్లి తేదీ(2017 డిసెంబరు 11) అని ఉంది.
ఎందుకిలా కనపడుతోంది?
2018లో రషీద్ తన అభిమానులతో ఇన్స్టాలో ముచ్చటించాడు. ఆ సమయంలో ఓ అభిమాని 'మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడగగా?'... 'అనుష్క శర్మ, ప్రీతి జింతా' అని బదులిచ్చాడు. అనంతరం అతడు చెప్పిన సమాధానం బాగా వైరల్ అయింది. ముఖ్యంగా రషీద్-అనుష్క శర్మ పేర్లతో శీర్షికలు బాగా ప్రచురితమయ్యాయి. దీంతో ఏమైందో తెలియదు గానీ గూగుల్ మాత్రం రషీద్ ఖాన్ భార్య పేరు అనుష్క శర్మగా చూపించడం మొదలుపెట్టింది.