మూడో టీ20లో సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. కెరీర్లో తొలిసారి ఇలాంటి సందర్భంలో బ్యాటింగ్ చేయడంపైనా మాట్లాడాడు హిట్‌మ్యాన్. మ్యాచ్ కోసం సిద్ధమయ్యే సమయంలో తన వస్తువులు వెతుక్కోవడానికి ఐదు నిమిషాలు పట్టిందని చెప్పుకొచ్చాడు.
" బ్యాటింగ్ అవగానే నా వస్తువులన్నీ బ్యాగులో సర్దేసుకున్నా. అందుకే సూపర్ ఓవర్ ముందు నా అబ్‌డామిన్ గార్డ్ వెతికేందుకు ఐదు నిమిషాలు పట్టింది. కివీస్ బ్యాటింగ్‌ను చూస్తే సూపర్ ఓవర్ గురించి ఆలోచనే రాలేదు. వారు సులభంగా మ్యాచ్ గెలుస్తారని అనిపించింది. సూపర్ ఓవర్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంపై సాధనేమీ ఉండదు. అదే బౌలర్‌కైతే ఏ ఓవర్‌నైనా ఒకేలా ఉంటుంది. నేను 60 పరుగులు చేయకుంటే నా బదులు శ్రేయస్ లేదా మరొకరు వచ్చేవారు. సౌథీ సవాల్‌గా బౌలింగ్ చేశాడు. తొలిసారి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా బౌలర్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా బ్యాటింగ్ చేశా. చివర్లో క్రీజులోనే ఉండాలా? ముందుకొచ్చి ఆడాలా? అన్న ఆలోచనలు వచ్చాయి. అతడు నా పరిధిలో బంతులు వేయడంతో చితకబాదాను"