ఆస్ట్రేలియాతో మ్యాచ్.. మైదానంలోనే కాదు.. గ్రౌండ్ బయట కూడా తలపడాల్సిందేనన్న విషయం దాదాపుగా క్రికెట్ ప్రేమికులకు తెలిసిన విషయమే. బ్యాట్-బంతికే కాదు.. నోటికి కూడా పని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ప్లేయర్స్‌ను అవహేళన చేస్తూ.. వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయడం ఆసీస్ ఆటగాళ్లకు మొదటి నుంచి ఉన్న అలవాటే. మైదానంలోకి అడుగు పెట్టాకా తమకు ఓడిపోయే పరిస్థితి వస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్లతో కవ్వింపులు చర్యలకు పాల్పడడటం.. వివాదాలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ విషయంలో మెన్స్ టీమే కాదు.. ఉమెన్స్ టీమ్ కూడా ముందుంటారు. ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంలో వారు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రీసెంట్గా భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ గురించి తాజాగా ఆసీస్ వికెట్ కీపర్ అలీసా హీలి చేసిన కామెంట్లు కూడా ఎంతలా చర్చనీయాశంమైనయో.. సోషల్‌మీడియాను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ గెలిచాక హర్మన్ రనౌట్ గురించి హీలి మాట్లాడుతూ.. సెమీ ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్‌కు ప్రయత్న లోపమే కారణం. కాస్త ట్రై చేసి ఉంటే రన్ చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రత్యర్థి కన్నా మెరుగ్గా ఉంటే పెద్ద టోర్నీలు గెలవొచ్చు. ఆ పనిని మేం బాగా చేస్తున్నాం" అని చెప్పింది. 'రనౌట్' విషయాన్ని బ్యాడ్ లక్ అంటూ హర్మన్ తనకు నచ్చినట్లుగా చెప్పుకోవచ్చు అంటూ అలీసా సెటైరికల్‌గా మాట్లాడింది. భారత జట్టుపై తనలో ఉన్న అక్కసును వెళ్లగక్కింది. గతంలోనూ ఆమె ఇలా ఎన్నో సార్లు నోరు జారి విమర్శలపాలైంది.
కరోనా సమయంలోనూ భారత జట్టు విదేశాల్లో పర్యటించినప్పుడు.. 2021లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అప్పుడు భారత ప్లేయర్స్‌కు సరైన వసతులు కల్పించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఫెయిల్ అయింది. దీనిపై మన ఆటగాళ్లు, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిస్బేన్‌లో తమకు కేటాయించిన రూమ్స్‌లో సరైన సదుపాయాలు లేవని, టాయిలెట్లు కూడా తామే క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కంప్లైంట్ చేశారు.