బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమ్ఇండియాకు ఓటమి తప్పేలే లేదు. తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన టీమ్ఇండియా బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల స్పిన్ మాయాజాలానికి 163 పరుగులే ఆలౌట్ అయ్యారు. ఆస్ట్రేలియాకు కేవలం టీమ్ఇండియా 76 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.
పుజారా ఒంటరి పోరాటం వృథా!.. కెప్టెన్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూశారా?
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూసేయండి.
టీమ్ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ కున్మెన్ ఐదు వికెట్లతో కుప్పకూల్చాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో మరో సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. టీమ్ఇండియా బ్యాటర్లలో కేవలం పుజారా ఒక్కడే రాణించాడు. కఠినమైన పిచ్‌పై ఒంటరి పోరాటం చేసి 142 బంతులు ఆడి 59 పరుగులు సాధించాడు. భారత్ ఆ మాత్రం ఆధిక్యమైనా సాధించిందంటే అది పుజారా వల్లే. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు పుజారా. ఓవైపు మిగతా ఆటకాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టినా పుజారా మాత్రం అడ్డు గోడలా నిలిచాడు. భారత్ ఆధిక్యాన్ని కనీసం 100 పరుగులు దాటించడానికి అతడు చాలా ప్రయత్నించాడు.
అయితే ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పుజారా పోరాటాన్ని ముగించింది. అతడు 59 పరుగుల దగ్గర ఉండగా.. లైయన్ బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో ఆడటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్.. కుడివైపు డైవ్ చేస్తూ మెరుపు వేగంతో క్యాచ్ అందుకున్నాడు. పుజారాను ఔట్ చేయడం దాదాపు అసాధ్యంగా కనిపించిన సమయంలో స్మిత్ పట్టిన ఈ క్యాచ్ అతడి పోరాటానికి ముగింపు పలికింది. పుజారా షాట్ కొట్టగానే ఎడమ వైపు కదిలిన స్మిత్.. బంతి కుడి వైపుకు రావడం గమనించి సడెన్‌గా ఆ వైపు డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ వికెట్‌తో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. కాగా, స్మిత్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.