తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ రైట్స్‌ కోసం బడా కంపెనీలు - ipl broadcasting rights 2022 auction

IPL 2022 Broadcast Rights: ఐపీఎల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకోవడానికి బడా కంపెనీ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్​ ఫ్రాంచైజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు తీవ్ర పోటీనిస్తున్న అమెజాన్‌ కూడా ఐపీఎల్ టెలికాస్ట్‌ రైట్స్‌ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

IPL 2022 Broadcast Rights
IPL 2022 Broadcast Rights

By

Published : Feb 20, 2022, 10:47 PM IST

IPL 2022 Broadcast Rights: ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ భారీ అడుగు వేయనుంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు తీవ్ర పోటీనిస్తున్న అమెజాన్‌ కూడా ఐపీఎల్ టెలికాస్ట్‌ రైట్స్‌ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. వందల మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కుల కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.50 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు ఈ బడా కంపెనీలు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ పోటీలు జరుగుతాయి.

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్‌ పోటీలు ప్రారంభమవుతాయి. ఈసారి ఐపీఎల్‌ను టాటా సంస్థ స్పాన్సర్‌ చేస్తోంది. ఐపీఎల్ ప్రసార హక్కులు వాల్ట్ డిస్నీ స్టార్‌ ఇండియా, సోనీ గ్రూప్ కార్ప్‌, జీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వద్ద ఉన్నాయి. 2017లో ఐదేళ్ల కాలానికి రూ.16,348 కోట్లకు బీసీసీఐ కేటాయించింది. ఈ సీజన్‌ వరకు ప్రసార హక్కులు స్టార్‌ఇండియా భాగస్వామ్య కంపెనీలదే. గతేడాది ఐపీఎల్‌ మొదటి ఫేజ్‌లో దాదాపు 350 మిలియన్ల వ్యూస్‌ను చేరుకోవడం విశేషం. వచ్చే ఐదేళ్ల కోసం ఈ మీడియా సంస్థలకు రిలయన్స్, అమెజాన్‌ నుంచి తీవ్ర పోటీ తప్పనుంది. ‘‘ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడ. దాదాపు 250 కోట్ల మంది అభిమానులు క్రికెట్‌ను ఆదరిస్తున్నారు. ఇలాంటి ఆటకు ఐపీఎల్‌ సూపర్‌ బౌల్‌లాంటిది’’ అని ఓ బెట్టింగ్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

జియో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్ విస్తరణ కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల బిడ్‌ను రిలయన్స్‌ దక్కించుకోవడం ఎంతో కీలకమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా రిలయన్స్‌ అనుబంధ మీడియా సంస్థ Viacom18లో జరుగుతున్న వ్యవహారాలు, స్పానిష్ ఫుట్‌బాల్‌ లీగ్‌ హక్కుల కొనుగోలు, ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ ఛానెల్‌ను ఏర్పాటు చేయడం వంటివన్నీ దీనికి సంకేతాలుగా తెలుస్తోంది. మరోవైపు ప్రైమ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రారంభించిన అమెజాన్‌ కూడా ఐపీఎల్‌ హక్కులను సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. దీనివల్ల ప్లాట్‌ఫామ్‌ యూజర్లను గణనీయంగా పెంచుకోవాలనేది అమెజాన్ ప్రణాళిక. అయితే అమెజాన్‌కు టీవీ ప్లాట్‌ఫామ్ లేకపోవడం మైనస్‌గా మారే అవకాశం ఉంది. టీవీ పార్టనర్‌నైనా కలుపుకొని బిడ్‌కు దాఖలు చేయాలి లేదా కేవలం డిజిటల్‌ విభాగం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. దీనిపై రిలయన్స్, Viacom18, అమెజాన్‌ ప్రతినిధులు స్పందించలేదు.

ఇదీ చూడండి:Harbhajan Singh: 'సాహాలా ఎవరికీ జరగకుండా చూడండి'

ABOUT THE AUTHOR

...view details