'పాడుతా తీయగా' బాధ్యతలను స్వీకరించిన ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్.. తండ్రి స్థాయిలో కాకపోయినా ఆయన అభిమానులు మెచ్చుకునే స్థాయిలో షోను నిర్వహిస్తానని చెబుతున్నారు. మద్రాసులో పుట్టి పెరగడం వల్ల తమిళ ప్రభావం తనపై ఎక్కువగా ఉన్నప్పటికీ అచ్చ తెలుగులో 'పాడుతా తీయగా'ను కొనసాగిస్తానని అన్నారు. ఎస్పీబీతో పోలుస్తూ వచ్చే విమర్శలు సాధారంగా స్వాగతిస్తానంటోన్న చరణ్.. 'పాడుతా తీయగా' లక్ష్యం నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెబుతున్నారు.
'పాడుతా తీయగా'.. ఎన్నో మధురమైన గళాలను సినీ సంగీత ప్రపంచానికి అందించిన వేదిక. ఈటీవీ ద్వారా ప్రతి ప్రేక్షకుడి హృదయ సాగరంలో సరిగమల ప్రవాహాన్ని పారించిన జీవనది లాంటి ఈ కార్యక్రమం మళ్లీ సరికొత్తగా ప్రేక్షకులకు పలుకరించేందుకు సిద్ధమైంది. అయితే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారన్న సందేహం సంగీత అభిమానుల మదిలో రకరకాలుగా ఉండేది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ, నాన్న గానాన్నే కాదు.. ఆయన సంగీత గమనాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నారు ఎస్పీ చరణ్. 'పాడుతా తీయగా' నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకొని.. ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.
తెలుగు సంగీత ప్రపంచంలో నాటికి నేటికి మేటిగా నిలిచిన తెలుగింటి ధారావాహిక 'పాడుతా తీయగా'. దక్షిణాదిలో తొలిసంగీత ఆధారిత రియాల్టీ షోగా గుర్తింపు పొందిన పాడుతా తీయగా.. సంగీతాభిమానులకు సరికొత్త అనుభూతులను పంచుతూ ఆపాత మధురాల్లోని సరిగమల సారాన్ని, సాహిత్య సౌరభాలను వెదజల్లింది. దాదాపు 18 ఏళ్లపాటు 1100కు పైగా ధారావాహికలతో ఎంతో మంది ఔత్సాహిక గాయనీ గాయకులను మెరికల్లా తీర్చిదిద్ది కళామతల్లికి అందించింది. వెండితెర మురిసిపోయేలా చేసింది.