ఎస్వీ కృష్ణారెడ్డి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో 'యమలీల' ఓ సంచలనం. పాతికేళ్లుగా హాస్యనటుడిగానే అలరించిన అలీ, ఈ సినిమాతో కథానాయకుడిగా మారాడు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా 'యమలీల... ఆ తర్వాత' పేరుతో ఓ ధారావాహిక రూపొందింది. 'యమలీల'లో నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ తల్లీకొడుకులుగా నటించడం విశేషం. ఈ నెల 21వతేదీ(సోమవారం) రాత్రి 8 గంటలకి ఈటీవీలో ప్రసారం కానుందీ ధారావాహిక. దీనికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ ధారావాహికకు సంబంధించిన కొన్ని విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
బుల్లితెరతో ప్రయాణం ఇదే తొలిసారి కదా...?
నిజానికి ఇదొక కొత్త ఆలోచన. సినిమా తర్వాత కథని ఇలా కూడా చెప్పొచ్చా? అనిపించింది. అందులోనూ సినిమాలోని తారలే మళ్లీ ఈ కథలో కనిపిస్తారు. ఇదొక గొప్ప ప్రయత్నం అనిపించింది. రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, దర్శకుడు సురేశ్, సహాయ దర్శకుడు బాలాజీ... ఇలా మేమంతా కలిసి ఈ కథని తీర్చిదిద్దాం. నాకు ఏ కథనైనా సినిమా కోసం రెండు, రెండున్నర గంటల నిడివితో చెప్పడమే అలవాటు. తొలిసారి ధారావాహిక కోసం అల్లడం కొత్త అనుభవాన్నిచ్చింది. ప్రేక్షకులతో మళ్లీ నిరంతరం టచ్‌లో ఉండే అవకాశం 'యమలీల... ఆ తర్వాత'తో దక్కింది. 'ఈటీవీ' కలగజేసిన ఓ గొప్ప అవకాశమిది.
అప్పట్లో 'యమలీల' కథ ఎలా పుట్టింది? ఆ సినిమా మీపైన, మీ కెరీర్పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?
రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన నుంచే 'యమలీల' కథ పుట్టింది. పైన బెర్త్‌లో పడుకుని ఎదురుగా ఉన్న ఫ్యాన్ చూస్తూ 'ఇది కిందపడితే ఏంటి పరిస్థితి?' అనుకున్నా. అలా కింద పడితే అనే అంశం గురించి అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు 'ఆకాశం నుంచి మన భవిష్యత్తు గురించి రాసిన పుస్తకం పడిపోతే? అది మరొకరికి దొరికితే?' అనే విషయాలపై ఆలోచనలు వచ్చాయి. అక్కడ్నుంచి అల్లుకున్న కథే 'యమలీల'.