చిత్రం: లవ్ స్టోరి;
నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల తదితరులు;
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల;
సంగీతం: పవన్ సీహెచ్;
నిర్మాతలు: నారాయణదాస్ నారంగ్, రాంమోహన్ రావు;
విడుదల తేది: సెప్టెంబర్ 24.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం 'లవ్‌స్టోరి'(Love Story Review). విడుదలకు ముందే పాటలతో మ్యూజికల్‌గా విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. లాక్డౌన్ ఆటంకాలు దాటుకొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరోనా కారణంగా సినిమా థియేటర్‌కు దూరమైన కుటుంబాలను మళ్లీ రప్పిస్తుందన్న చిత్రబృందం అంచనాల నడుమ విడుదలైన 'లవ్‌స్టోరి' ఎలా ఉందో 'ఈటీవీ భారత్' సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
'లవ్‌స్టోరి' సినిమా పోస్టర్ కథేంటంటే:
రేవంత్(నాగచైతన్య) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వచ్చి జుంబా ఫిట్నెస్ సెంటర్ నడిపిస్తుంటాడు. అదే ఊరి నుంచి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన మౌనిక(సాయిపల్లవి) రేవంత్ ఇంటి పక్కనున్న స్నేహితురాలి దగ్గరకు రూమ్మేట్గా వస్తుంది. పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు. అందరూ నీ వల్ల కాదని మౌనికను నిరాశపరుస్తుంటారు. అప్పుడే రేవంత్‌తో పరిచయం ఏర్పడుంది. తనతో కలిసి ఓ రోజు డ్యాన్స్ చేస్తుంది.
మౌనికలోని డ్యాన్స్ టాలెంట్ గుర్తించిన రేవంత్.. తన భాగస్వామ్యంతో జుంబా ఫిట్నెస్ సెంటర్ వ్యాపారంలో రాణించాలనుకుంటాడు. కానీ మొదట మౌనిక ఒప్పుకోదు. ఇంట్లో తెలియకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో రేవంత్‌తో కలిసి డ్యాన్స్ నేర్పిస్తుంటుంది. ఈ క్రమంలో వాళ్లిద్దరు ప్రేమలో పడతారు. మౌనికకు వాళ్ల బాబాయ్ నర్సింహా పటేల్ (రాజీవ్ కనకాల) అంటే భయం. ఊళ్లో బడా భూస్వామిగా పెత్తనం చెలాయిస్తుంటాడు. వెనుకబడి కులాల వాళ్లంటే అస్సలు పడదు. అలాంటి కులంలో పుట్టిన రేవంత్‌తో మౌనిక ప్రేమను ఆ కుటుంబం ఒప్పుకొందా? బాబాయ్ అంటే మౌనికకు ఎందుకు అంత భయం?. తెలియాలంటే సినిమా(Love Story Review) చూడాల్సిందే.
'లవ్‌స్టోరి' సినిమా పోస్టర్ ఎలా ఉందంటే?
తెలుగు తెరపై కుల, మత ప్రస్తావనతో వచ్చే ప్రేమకథలకు మళ్లీ డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. ఇటీవలే ఉప్పెన, శ్రీదేవిసోడా సెంటర్ లాంటి చిత్రాలను చూసిన ప్రేక్షకులకు ఈవారం వచ్చిన ఆ తరహా ప్రేమకథే 'లవ్‌స్టోరి'(Love Story Review). అయితే ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే చిత్రం. ప్రేమకు, కుల వివక్షతకు మధ్య సమాజంలో నెలకొన్న ఒక చిన్న లైన్ ను రాసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.. వెండితెరపై ఎంతో హృద్యంగా తమ ప్రేమకథను ఆవిష్కరించాడు. ప్రేమ చుట్టూ ఉన్నన్ని ముళ్ల కంచలు దేని చుట్టూ ఉండవు. ప్రేమ కోసం జరిగినన్ని యుద్ధాలు దేని కోసం జరగవు. కాలాలు, కట్టుబాట్లు, గెలుపు, ఓటముల ఆవలి తీరంలో ఎప్పటికీ నిలిచేది, వెలిగేది ప్రేమ మాత్రమే అనే విషయాన్ని చెప్పాలనుకున్న శేఖర్ కమ్ముల... రేవంత్- మౌనికలతో ఆ ప్రయత్నం చేశాడు.
ప్రథమార్థం రేవంత్-మౌనికలు జుంబా సెంటర్‌తో జీవితంలో ఎలా స్థిరపడాలన్న సన్నివేశాలతో నడిపించారు. ద్వితీయార్థానికి వచ్చేసరికి వాళ్లిద్దరు అసలు ప్రేమకథ మొదలవుతుంది. ఊళ్లల్లో ఉన్న కులం కట్టుబాట్లను, వెనుకబడిన వర్గాల ప్రజల స్థితిగతులను పైపైన టచ్ చేశారు. సెకండాఫ్‌లో రేవంత్-మౌనికలు తమ ప్రేమను గెలిపించుకునేందుకు పడిన తపను ఆవిష్కరిస్తూనే కులవివక్ష నడుమ చిక్కుకున్న ప్రేమజంటలు పారిపోయి ప్రాణాలు తీసుకోవడం కంటే ఎదురునిలిచి ప్రేమను గెలిపించుకోవాలనే అంశాన్ని ప్రస్తావించాడు. అలాగే హీరోయిన్‌కు ఎదురైన ఓ సంఘటనతో సమాజాన్ని ప్రశ్నిస్తూ సమాజం పట్ల శేఖర్ కమ్ముల దర్శకుడిగా తనవంతు బాధ్యతను చాటుకున్నాడు.
'లవ్‌స్టోరి' సినిమా పోస్టర్ ఎవరెలా చేశారంటే?
శేఖర్ కమ్ముల కథకు ప్రాణం పోశారు నాగచైతన్య, సాయిపల్లవి. రేవంత్, మౌనిక పాత్రల్లో జీవించేశారు. మౌనిక పాత్రలో సాయిపల్లవి నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన పాట దొరికితే చెలరేగిపోవడం సాయిపల్లవికి ఢీతో పెట్టిన విద్య. అలాంటి పాటలే సాయిపల్లవికి పడ్డాయి. మొదటి పాటతోపాటు సారంగ ధరియాలో చేసిన డ్యాన్స్ సాయిపల్లవికి ఫిదా అవ్వాల్సిందే. ప్రేమికురాలిగా తనలోని హావభావాలు, భయపడుతూ చేసే సన్నివేశాలతో సాయిపల్లవి ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. ఇక లవర్‌బాయ్‌గా నాగచైతన్య చక్కటి నటనను ప్రదర్శించాడు.
గ్రామంలో వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా, డ్యాన్సర్‌గా చైతూలో కొత్తదనం కనిపిస్తుంటుంది. వీరిద్దరు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి. అలాగే ఆ బలానికి సంగీత దర్శకుడు పవన్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం 'లవ్‌స్టోరి'ని మరో స్థాయికి చేర్చాయి. నాగచైతన్య తల్లి పాత్రలో నటించిన ఈశ్వరీరావు నటన మధ్యతరగతి కుటుంబాల్లోని మనుషులను గుర్తుకుతెస్తుంది. నర్సింహ పాత్రలో రాజీవ్ కనకాల, సాయిపల్లవి తండ్రి వెంకటేశం పాత్రల్లో ఆనంద్ చక్రపాణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమాజంలో నెలకొన్న సున్నితమైన అంశాన్ని తన ప్రేమకథ చుట్టూ అల్లుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
'లవ్‌స్టోరి' సినిమా పోస్టర్ అయితే తనదైన శైలిలోనే నెమ్మదిగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ ఫీలవకుండా సందర్భానుసారంగా వచ్చే పాటలతో 'లవ్‌స్టోరి'ని(Love Story Review) ప్రేక్షకులకు చేరువచేశాడు. కానీ కులవివక్షతో మొదలుపెట్టిన కథ.. చివరకు ఓ కుటుంబంలో సంవత్సరాల తరబడి నలుగుతున్న బాధను పరిష్కరించేవైపు నడవడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నిస్తూనే.. చచ్చే ముందు తేల్చుకొని చద్దామనే హీరోహీరోయిన్లతో చెప్పిన విధానం సగటు వివక్షను ఎదుర్కొంటున్న ప్రేమికులకు బలాన్ని ఇస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
బలం:నాగచైతన్య, సాయిపల్లవి, పాటలు, సంగీతం
బలహీనత: కథ, ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరగా: 'లవ్‌స్టోరి'... సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రం
ఇదీ చూడండి..Love Story Review: 'లవ్‌స్టోరి' మూవీ సోషల్ రివ్యూ!