ఆకట్టుకునే కథ, కథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ సినిమాలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'.
తమిళంలో "కణ"గా ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన నటి ఐశ్వర్య రాజేశ్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఐశ్వర్యకు తెలుగులో కౌసల్య హిట్ ఇచ్చిందా లేదా? ఆ చిత్రం ఎలా ఉంది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథేంటి ?
ఇరగవరం గ్రామంలో రైతు కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్)కు క్రికెట్ అంటే మహా ఇష్టం. భారత జట్టు ఓడిపోతే తట్టుకోలేడు. ఓ రోజు తండ్రి బాధపడటం చూసిన కుమార్తె కౌసల్య.. క్రికెటర్‌గా ఎదిగి భారత జట్టును గెలిపించి తన తండ్రిని సంతోషపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆడపిల్లకు క్రికెట్ ఎందుకని అవహేళన చేస్తుంటారు. తండ్రిని వ్యవసాయ అప్పులు వేధిస్తుంటాయి. అయినా మగపిల్లల జట్టులో చేరి క్రికెట్ నేర్చుకున్న కౌసల్య... చిన్నప్పుడు తను అనుకున్నది సాధించిందా? అప్పుల బాధలోనూ కృష్ణమూర్తి తన కూతురును ఎలా ప్రోత్సహించాడు? చివరకు కౌసల్య కృష్ణమూర్తి ఏమైంది అనేదే ఈ చిత్ర కథ.
ఎలా ఉందంటే ?
క్రీడా నేపథ్యమున్న కథకు సమకాలీన రైతుల పరిస్థితిని మేళవించిన సినిమా ఇది. తండ్రీ కూతురు మధ్య బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన చిత్రమిది. మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకులకు కట్టిపడేస్తుంది. గ్రామీణ ప్రాంత అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎలా ఎదిగింది, ఆ ప్రయాణంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెరపై ప్రతిబింబించారు. అడుగడుగునా అమ్మాయిల్లో స్ఫూర్తి నింపేలా కథ, కథనాలను తీర్చిదిద్దారు.
ప్రథమార్థం క్రికెట్‌పై కౌసల్యకు ఎలా ఇష్టం పెరిగింది, తండ్రి కృష్ణమూర్తితోపాటు గ్రామంలో ఉన్న యువకులు ఎలా సహకరించారనే విషయాలను వివరించిన దర్శకుడు ద్వితీయార్థంలో కౌసల్య తన లక్ష్యాన్ని ఎలా సాధించింది, రైతులను అప్పుల పాలు చేయకూడదనే సందేశంతో ముగించారు.
ఎవరెలా చేశారు ?
'కణ'లో నటించిన ఐశ్వర్య రాజేశ్ తెలుగులోనూ నటించింది. నిజమైన క్రికెటర్‌గా తెరపై తనదైన నటనను ప్రదర్శించింది. బౌలర్‌గా నటించడం కోసం ఐశ్వర్య పడిన శ్రమ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంటుంది. తెలుగులో తొలిసారిగా నటించిన ఐశ్వర్య ఇక్కడి ప్రేక్షకులనూ మెప్పిస్తుంది.