తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: భావోద్వేగాల 'డియర్ కామ్రేడ్'

శుక్రవారం విడుదలైన 'డియర్ కామ్రేడ్'.. హీరో విజయ్ దేవరకొండను సరికొత్తగా ఆవిష్కరించింది. సినిమాలోని బాబీ-లిల్లీ ప్రేమాయణం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

డియర్ కామ్రేడ్ సమీక్ష

By

Published : Jul 26, 2019, 3:05 PM IST

Updated : Jul 26, 2019, 3:16 PM IST

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌ణ్న, రావు ర‌మేశ్ త‌దిత‌రులు
సంగీతం: జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్‌
సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శక‌త్వం: భ‌ర‌త్ కమ్మ

అనతి కాలంలోనే ఊహించని అభిమాన గణం సంపాదించుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా చిత్రాలతో వరుస విజయాలందుకొని ప్రేక్షకులతో 'రౌడీ' అని ముద్దుగా పిలిపించుకున్నాడు. "డియర్ కామ్రేడ్" గా ప్రేక్షకుల్ని శుక్రవారం పలకరించాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు తానే సమస్తమై ప్రచారాన్ని హోరెత్తించాడు. మరి విజయ్ హిట్టు కొట్టాడా లేదా అనేది తెలియాలంటే చిత్ర సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కాలేజ్ సన్నివేశంలో విజయ్ దేవరకొండ

ఇంతకీ 'కామ్రేడ్' కథేంటి?
బాబీ అలియాస్ చైతన్య (విజయ దేవరకొండ‌) కాకినాడ డిగ్రీ కళాశాలలో చదువుతుంటాడు. వామపక్ష భావజాలం నేపథ్యమున్న కుటుంబంలో పుట్టడం, తాత కామ్రేడ్ సూర్యం స్ఫూర్తితో స్టూడెంట్ లీడర్​గా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తుంటాడు. అప్పుడు లిల్లీ అలియాస్ అపర్ణదేవి(రష్మిక మందణ్న) పరిచయమవుతుంది. క్రికెట్​లో ఆమె రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. జాతీయ జట్టుకు ఆడాలనేది తన కల. ఈ సమయంలో లిల్లీ, బాబీ ప్రేమలో పడతారు. కానీ అతడి ఆవేశం, గొడవలు లిల్లీకి నచ్చవు. అప్పటికే తన అన్నయ్యను కోల్పోయిన లిల్లీ.. బాబీని ఎక్కడ దూరం చేసుకుంటానో అని మదన పడుతుంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడిపోతారు. డ్రిపెషన్​లోకి వెళ్లిపోతుంది లిల్లీ. మూడేళ్ల తర్వాత ఆమెను కలుసుకున్న కథానాయకుడు అందుకు కారణాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత లిల్లీకి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించాడనేది "డియర్ కామ్రేడ్" కథ.

డియర్ కామ్రేడ్​లో విజయ్ దేవరకొండ-రష్మిక మందణ్న

ఎలా ఉందంటే...?
భావోద్వేగాలతో కూడుకున్న చిన్న అంశం. కానీ సుమారు మూడు గంటలపాటు సాగదీయడం వల్ల ప్రేక్షకుల కొంత ఇబ్బందికి గురవుతారు. ప్రథమార్థం కాలేజ్ గొడవలు, హీరో హీరోయిన్​ మధ్య ప్రేమాయణంతో సాగిపోతుంది. ద్వితీయార్థం కొంచెం ఫర్వాలేదనిపిస్తుంది. కథకు కీలకమైన విషయాన్ని పతాక సన్నివేశాలకు అరగంట ముందు చెప్పే సమయానికి... అసలు విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది.

ఎవరెలా నటించారు...?
విజయ్ దేవరకొండ, రష్మికలే ప్రధాన బలం. వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు. విద్యార్థి నాయకుడు, ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ తనలోని నటుడ్ని మరోసారి తెరపై ఆవిష్కరించాడు. ప్రేమ కథకు క్రికెట్, వామపక్ష భావాలను జోడించిన దర్శకుడు భరత్ కమ్మ.. సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

డియర్ కామ్రేడ్​లో విజయ్ దేవరకొండ-రష్మిక మందణ్న

"భయాన్ని వదిలేస్తే ఎవరు అడ్డొచ్చినా విజయాన్ని సాధించవచ్చు" అనే కథాంశంతో డియర్ కామ్రేడ్ కథను అల్లుకున్నాడు భరత్. జాతీయ స్థాయి క్రికెట్ ఎంపికలో మహిళా క్రికెటర్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో కథను సాగదీశాడు. ఈ కారణంతో కథ కాస్త సంక్లిష్టంగా మారింది. జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. సంచలనంగా మారిన క్యాంటీన్ పాట సినిమాలో లేకపోవడం కొసమెరుపు.

బలాలు

  • విజయ్ దేవరకొండ
  • రష్మిక మందణ్న

బలహీనతలు

  • సాగదీసే కథనం
  • నిడివి

చివరగా చెప్పేదేమిటంటే...!

కత్తెర పడితే బాగుండేది కామ్రేడ్. విజయ్ అభిమానులకు మాత్రమే 'డియర్ కామ్రేడ్'.

గమనిక:ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Last Updated : Jul 26, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details