కరోనా వైరస్ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బయటకు రావాలంటేనే భయంగా ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాల మధ్య తిరగడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. నిరుపేదల అవసరాలను తీర్చేందుకు నటుడు కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వినాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'జనాల మధ్యకు రావాలంటే భయంగా ఉంది' - కరోనాపై వినాయక్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ జనాల మధ్య తిరగాలంటేనే భయంగా ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ తెలిపారు. సినీ కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు నటుడు కాదంబరి కిరణ్ చేపట్టిన సేవా కార్యక్రమంలో పాల్గొన్న వినాయక్.. ఈ సందర్బంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు.
మనం సైతం, వసుధ ఫౌండేషన్ అధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి వినాయక్ సహా, ప్రముఖ కథానాయిక పూనమ్ కౌర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సుమారు 230 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వసుధ ఫౌండేషన్ తరపున మంతెన వెంకటరామరాజు నిరుపేదలకు సహాయాన్ని అందించడం పట్ల వినాయక్, పూనమ్ కౌర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణం పట్ల బాధ్యత చాటుకున్నారు.
ఇదీ చూడండి:రూ.36 వేల కరెంటు బిల్లుతో తాప్సీకి షాక్