"అడవిలో చిత్రీకరణ తొలి రెండు మూడు రోజులు కష్టంగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైంది. అడవి వ్యక్తిగతంగా నాకూ చాలా విషయాల్ని నేర్పించింది" అంటున్నారు యువ కథానాయకుడు వైష్ణవ్‌తేజ్(vaishnav tej kondapolam). చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన ఈయన తొలి చిత్రం 'ఉప్పెన'తోనే విజయాన్ని అందుకున్నారు. రెండో చిత్రంగా 'కొండపొలం' చేశారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం నేడు (అక్టోబర్ 8) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వైష్ణవ్(vaishnav tej interview) గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"తొలి సినిమా 'ఉప్పెన'(uppena movie)లో మత్స్యకార కుటుంబానికి చెందిన కుర్రాడిగా కనిపించా. ఇందులో చదువుకుని గొర్రెల్ని కాయడం కోసం వెళ్లిన కుర్రాడిగా కనిపిస్తా. రెండూ సహజమైన పాత్రలే. అయితే కేవలం ఇలాంటి పాత్రలే చేయాలనే నియమంతో నేనేమీ కథల్ని ఎంచుకోలేదు. 'రంగస్థలం'(rangasthalam movie) నుంచి మన సినిమాల గమనం మారిపోయింది. కథ, పాత్రల రీత్యానే తెరపై కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గిరిసాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రొమాంటిక్ కామెడీ కథతో తెరకెక్కుతోంది. ఆ కథకి తగ్గట్టుగానే అందులో క్లాస్ కుర్రాడిగా కనిపిస్తా. ఫక్తు వాణిజ్యాంశాలున్న కథ 'కొండపొలం'(kondapolam movie). ఇంట్లో నేనెవరినీ సలహాలు అడగలేదు. మా ఇంట్లో అంత మంది కథానాయకులు ఉన్నా.. వాళ్లందరినీ స్టార్లుగానే చూసే నేను, 'ఇలా ఓ సినిమా చేస్తున్నా, ఎలా నటించాలి’'అని వాళ్లని అడగలేను. ఆ విషయంలో నాకు చాలా సిగ్గు (నవ్వుతూ). అందుకే దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగానే నటిస్తుంటా."
"కొండపొలం(kondapolam movie) అనే మాటనే చాలా మంది విని ఉండరు. ఆ అంశమే కొత్తగా అనిపించింది. అలాగే పులి, ఆ నేపథ్యంలో ఫాంటసీ.. ఇలా అన్నీ ఆసక్తికరంగా అనిపించాయి. ఇలాంటి కొత్త కథని చెప్పాల్సిందే అని మేమంతా కలిసి ఈ సినిమా చేశాం. మొదట దర్శకుడు క్రిష్(krish jagarlamudi new movie) ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం కాదేమో, ఊరికే రమ్మన్నారేమో అనుకున్నా. కానీ సినిమా కథ చెప్పారు. 'హరి హర వీర మల్లు' తర్వాత ఉంటుందేమో అనుకుంటే, వెంటనే ప్రారంభిస్తున్నాం అన్నారు. నేను ఊహించని అవకాశం ఇది. చాలా సంతోషంగా అనిపించింది. క్రిష్ తీసిన 'గమ్యం', 'వేదం'.. ఇలా ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం."