సెలబ్రిటీ.. ఈ ఒక్క మాట చాలు సమాజంలో హోదా.. గౌరవం.. అభిమానించే కోట్లాది ప్రేక్షకులు.. ఇంకేం కావాలి. ఈ ఆనందంలో అంతకు ముందుపడ్డ శ్రమను మర్చిపోతుంటారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అందరికీ కనపడదు. అవకాశం దొరికితే విమర్శించే వాళ్లూ.. అవసరం లేకపోయినా సలహాలు ఇచ్చేవారు ఎందరో. వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందిస్తే సరే.. లేకపోతే చిన్నపాటి పోరాటమే చేయాల్సి వస్తుంది.
సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన ఈ కాలంలో.. తమ అభిమాన కథానాయకుడు/నాయికను ఎవరైనా చిన్న మాట అంటే చాలు అభిమానులు సహించలేకపోతున్నారు. వారిపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇటీవల కాలంలో కథానాయికలు వీటిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దుస్తులు, పాత్రల ఎంపిక నుంచి.. శరీర బరువు వరకూ విమర్శలు తప్పడం లేదు. అలా నటీమణుల్ని ఇబ్బంది పెట్టిన విషయాలివే..
అభిమానిని కాదు అన్నందుకు..
"చిత్ర పరిశ్రమలో మేమంతా స్నేహితులం" అని హీరోలంతా చెబుతున్నా వారి అభిమానుల తీరు మాత్రం మారడం లేదు. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వాగ్వాదానికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కథానాయిక మీరా చోప్రా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ "ఎన్టీఆర్ గురించి చెప్పండి?" అని అడిగారు. "నాకు ఆయన గురించి తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు.. మహేశ్ బాబు అంటే ఎక్కువ ఇష్టం" అని బదులిచ్చారు. దీంతో తారక్ అభిమానులుగా చెప్పుకుంటూ.. కొంతమంది ఆమెను అసభ్య పదజాలంతో ట్వీట్‌లు చేయడం మొదలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని భరించలేక మీరా చోప్రా సోషల్ మీడియా వేదికగా సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలుగులో 'బంగారం', 'వాన', 'గ్రీకు వీరుడు' సినిమాల్లో మెరిసిందీ అందాల భామ.
రకుల్ ఆ డ్రెస్ ఏంటి?
కథానాయికలు డ్రెస్సింగ్, డైటింగ్, ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంటారు. అందంగా, విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పొట్టి దుస్తులు వేసుకున్నారని నెటిజన్లు అసభ్యంగా మాట్లాడారు. దీనికి రకుల్ స్పందిస్తూ.. "ఇలాంటి మనుషులు సమాజంలో ఉన్నంత వరకు మహిళలకు భద్రత ఉండదు. మహిళల సమానత్వం, రక్షణ గురించి మాట్లాడతారు కానీ.. పాటించరు" అని ట్వీట్ చేశారు.
క్షమాపణ చెప్పాల్సిందే!
కథానాయిక పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొన్ని గంటల పాటు హ్యాకింగ్‌కు గురైందని ఇటీవలె ఆమె ప్రకటించింది. హ్యాకర్ తన ఖాతా నుంచి నటి సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. పూజా స్పందించి ఇన్‌స్టా ఖాతాను పునరుద్ధరించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమంత గురించి పూజా ఇన్‌స్టాలో హ్యాకర్ పెట్టిన అభ్యంతర వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వాటిని చూసిన సమంత అభిమానులు ట్విటర్ వేదికగా "పూజా హెగ్డే క్షమాపణ చెప్పాలి" అంటూ ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు.
అలాగేనా రిప్లై ఇచ్చేది?
'గూఢచారి' సినిమాతో ఆకట్టుకున్న కథానాయిక శోభితా ధూళిపాళ్ల. అడివి శేషు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను చూసిన మహేశ్‌బాబు కొన్నాళ్ల క్రితం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి శోభితా రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ' అన్నారు. "సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో మాట్లాడే తీరు ఇదేనా..?, గౌరవిస్తూ మాట్లాడాలని తెలియదా..?, పొగరా..?" అంటూ రకరకాలుగా మాట్లాడారు.
మీ అమ్మలా లేవేంటి?
అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ నటిగా రాణిస్తున్నారు. అచ్చం అమ్మలానే ఉందంటూ జాన్విని చూసి అభిమానులు ఆనందపడ్డారు. అయితే శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్.. జాన్వితో పోలిస్తే విభిన్నంగా ఉంటారు. ఈ నేపథ్యంలో తన రూపం అమ్మ శ్రీదేవిలా లేదని చాలా మంది విమర్శించారని ఇటీవల ఖుషి ఆవేదన చెందారు. 19 ఏళ్ల వయసులో ఇలాంటి ట్రోల్స్ తనను మానసికంగా బాధిస్తున్నాయని చెప్పారు. "నేనూ ఓ సాధారణ అమ్మాయినే" అని అభిప్రాయాల్ని పంచుకున్నారు.
పవన్ ఊసు ఎత్తితే...
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ట్విట్టర్లో విమర్శల్ని భరించలేక.. ప్రశాంతత కోసం అకౌంట్‌ను డిలీట్ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇటీవల 'బద్రి' సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేణూ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌తో సెట్‌లో తీసుకున్న ఫొటోల్ని షేర్ చేశారు. దీంతో కొందరు అభిమానులు ఆమెపై మండిపడ్డారు. ఇలా అనేక సందర్భాల్లో ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే కొన్ని ఇన్‌స్టా పోస్ట్‌లకు ఆమె కామెంట్ ఆప్షన్ కూడా ఇవ్వడం లేదు.