తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ బ్యాచిలర్స్​ వచ్చేస్తున్నారు..! - మోస్ట్​ ఎలిజెబుల్​ బ్యాచిలర్​ సినిమా

చిత్రసీమలో ఒక్కో ఏడాది ఒక్కో రకమైన కథల హవా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ప్రేమకథలు ఎక్కువగా తెరకెక్కుతాయి. మరి కొన్నిసార్లు ప్రతీకార కథాంశాలతో సినిమాలు వస్తాయి. దీన్నే ట్రెండ్‌ అంటుంటారు. గతేడాది థ్రిల్లర్‌ కథల జోరు బాగా కనిపించింది. ప్రస్తుతం బ్రహ్మచారుల కథలపై దర్శకులు మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. 'సింగిల్‌ ఫరెవర్‌' అంటూ నితిన్‌, 'సోలో బ్రతుకే సో బెటర్‌'తో సాయిధరమ్​ తేజ్‌ ఇప్పటికే తాము బ్రహ్మచారులమని ప్రకటించేశారు. తాజాగా నేనూ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'ని అంటున్నాడు అక్కినేని అఖిల్​.

tollywood bachelors-nithiin-saidharam tej-akkineni Akhil
టాలీవుడ్​ బ్యాచిలర్స్​ వచ్చేస్తున్నారు..!

By

Published : Feb 4, 2020, 10:39 AM IST

Updated : Feb 29, 2020, 2:58 AM IST

టాలీవుడ్​లోని దాదాపు అన్ని సినిమాల్లో చివరి వరకు కథానాయకులు బ్రహ్మచారులుగా ఉంటారు. కథ క్లైమాక్స్​లో హీరోయిన్​తో ఒక్కటైపోతారు. అప్పటి వరకు ఒకరి మనసుని మరొకరు గెలవటానికి తపిస్తుంటారు. అడ్డంకులన్నింటినీ అధిగమించేసి అనుకున్నది సాధిస్తారు. ఆ తర్వాత పెళ్లితోనో లేదంటే, ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేసుకోవడంతోనో శుభం కార్డు పడిపోతుంటుంది. ఈసారి అందుకు భిన్నంగా బ్రహ్మచారుల జీవితాలే ఇతివృత్తంగా సినిమాలు రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

సోలో సైన్యంతో..

"సోదర సోదరీమణులారా మన నినాదం ఒక్కటే.. సోలో బ్రతుకే సో బెటర్‌" అంటున్నాడు సాయిధరమ్​ తేజ్‌. ఈ చిత్రంలో అతడు బ్రహ్మచారులకి ప్రతినిధిగా కనిపిస్తాడనే విషయం తెలుస్తోంది. సాయితేజ్‌ హీరోగా సుబ్బు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నభా నటేష్‌ హీరోయిన్​, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మే 1న సినిమాను విడుదల చేయటానికి చిత్రబృందం సన్నాహలు చేస్తోంది. పూర్తి వినోదాత్మకంగా సాగే రొమాంటిక్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సోలో బతుకే సో బెటర్​లో సాయి తేజ్​

కథానాయకులు పేరుకు సోలో అంటారు కానీ.. చివరికొచ్చేసరికి వాళ్లూ అమ్మాయిల మనసుల్ని దోచేస్తుంటారు. జంటగా కనిపించేసి ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంటారు. మరి తేజ్‌ బ్రహ్మచారుల సైన్యానికి ఎలాంటి సందేశం ఇస్తాడన్నది తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే.

ఎలిజెబుల్​ బ్యాచిలర్​.. అఖిల్​...

అఖిల్‌ అక్కినేని కొత్త చిత్రంలో బ్యాచిలర్‌గానే సందడి చేయబోతున్నట్టు సమాచారం. అతడు హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అఖిల్​ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'గా అఖిల్‌ వినోదం పంచుతాడని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్​పై ఫిబ్రవరి 4న స్పష్టత ఇవ్వనుంది చిత్రబృందం. 'హలో', 'మిస్టర్‌ మజ్ను' సినిమాల్లో ప్రేమికుడిగా మెప్పించిన అఖిల్‌.. ఈసారి బ్యాచిలర్‌గా చేసే సందడి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అక్కినేని అఖిల్​

నితిన్​.. సింగిల్​ ఫర్​ ఎవర్​..

తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో నితిన్‌ ఒకడు. కొన్ని నెలల్లోనే అతడు పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం. వ్యక్తిగత జీవితంలో అతడికి తోడు దొరికినా... తెరపైన మాత్రం 'హై క్లాస్‌ నుంచి లోక్లాస్‌ దాకా, నా క్రష్‌లే వందల్లో ఉన్నారులే, ఒక్కళ్లూ సెట్టవ్వలే' అంటూ ఒంటరి గీతాన్నే 'భీష్మ'లో ఆలపించబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక కథానాయిక. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం.

భీష్మ చిత్రంలో రష్మిక, నితిన్​

ఇదీ చూడండి...'ఎఫ్‌ 3' విడుదలపై దిల్​రాజు క్లారిటీ

Last Updated : Feb 29, 2020, 2:58 AM IST

ABOUT THE AUTHOR

...view details