డిసెంబర్లో స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అరుదు. తెలుగు నాట సంక్రాంతి హడావిడి ముందే మొదలైపోతుంది కాబట్టి.. డిసెంబర్ మొత్తం పెద్ద పండగకు వచ్చే సినిమాల హడావిడే ఎక్కువ. వాటికి సంబంధించిన ప్రచారం, వేడుకలతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతుంటుంది. మహా అంటే క్రిస్మస్, జనవరి 1ని లక్ష్యంగా చేసుకుని ఒకట్రెండు సినిమాలు వస్తుంటాయంతే. సంక్రాంతికే అసలు సిసలు సినీ సందడి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పండగ ముందే వచ్చేసిందా? అన్నట్టుగా అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కడుతున్నాయి. గల్లా పెట్టెలు.. కొత్త రికార్డులు సంక్రాంతి కోసం వామ్అప్ చేసుకోవాలేమో అన్నట్టుగా... 'తగ్గేదే లే' అంటూ వేసవి వరకు సినిమాలు పక్కా ప్రణాళికలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
కరోనా రెండో దశ తర్వాత
జులై నెలాఖరుకే తెలుగులో సినిమాలు రిలీజ్లు మొదలయ్యాయి. తెలుగు ప్రేక్షకుడు అందరికంటే ధైర్యంగా థియేటర్‌కు వచ్చి టికెట్ కొన్నాడు. ఆ భరోసా.. ఆ ఉత్సాహం చిత్రసీమపై స్పష్టమైన ప్రభావమే చూపించింది. సినిమాలు ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. అయితే నమోదైన విజయాలు కొన్నే. కుటుంబ ప్రేక్షకులతో పాటు.. మాస్ ప్రేక్షకుడూ పూర్తిస్థాయిలో థియేటర్‌కు రావడం లేదనే విషయాన్ని వసూళ్లు రుజువు చేస్తూ వచ్చాయి.
నవంబర్‌లో అయితే పదుల సంఖ్యలో విడుదలైనా ఒక్క విజయమూ నమోదు కాలేదు. ఇప్పుడు అందరి చూపూ ముగింపుపైనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు మునుపటిలా పోటెత్తాలంటే అగ్రతారల చిత్రాలు విడుదల మాత్రమే మార్గమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టే డిసెంబర్ మాసంలో బాలకృష్ణ, అల్లు అర్జున్, నాని తదితర తారలు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.
'అఖండ'తో ఆరంభం
ఈ ఏడాది తెలుగు చిత్రాలకు కీలకమైన ఈ నెలను బాలకృష్ణ 'అఖండ'తో ఆరంభిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్ని మరింత ఉత్సాహంగా థియేటర్‌కు రప్పించే సత్తా ఉన్న కలయిక బాలకృష్ణ - బోయపాటి శ్రీనుది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందిన ‘అఖండ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, మాస్ ప్రేక్షకుల్లోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం గురువారమే విడుదలవుతోంది. ప్రారంభ వసూళ్లు మరో స్థాయిలో ఉండనున్నాయనడానికి ముందుస్తుగా అమ్ముడవుతున్న టికెట్లే ఉదాహరణ. విదేశాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీసును పెద్దఎత్తున ప్రభావితం చేస్తోంది. బాలయ్య మళ్లీ థియేటర్లకు మునుపటి కళ తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నెల 3న మరో స్టార్ కథానాయకుడు మోహన్‌లాల్ నటించిన 'మరక్కార్' విడుదలవుతోంది. ఇప్పటికే జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 4న నిత్యమేనన్, సత్యదేవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'స్కైలాబ్' విడుదలవుతోంది. వీటి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. విజయంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.