తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జీవితమనే ఆటలో అర్థాంతరంగా ముగిసిన ఇన్నింగ్స్​ - dhoni fame hero special life story

కెరీర్​లో ఎంతో భవిష్యత్తున్న బాలీవుడ్​ నటుడు 'ధోనీ' ఫేం హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ అర్థాంతరంగా తనువు చాలించాడు. సినిమాల్లో ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఈ యువ హీరో.. ఆత్మహత్య చేసుకున్నాడు.​ ఈ క్రమంలోనే సుశాంత్​ సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

SUSHANTH SINGH RAJPUT SPECIAL STORY
జీవితమనే ఆటలో ఆర్దంతరంగా ఇన్నింగ్స్​ ముగింపు

By

Published : Jun 15, 2020, 6:54 AM IST

"మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే... అది ప్రాణమే"

- 'చిచ్చోరే' చిత్రంలో సుశాంత్‌ పలికే డైలాగ్‌.

చదువుల ఒత్తిడి భరించలేక ర్యాంకు సాధించలేదనే నిరాశలో కొడుకు ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఆసుపత్రిలో కుమారుడి పక్కన కూర్చొని సుశాంత్‌ పాత్ర ఆ మాటలంటుంది. మరి ఇవే మాటలను తన జీవితానికి ఎందుకు అన్వయించు కోలేకపోయాడో? అనేది అభిమానులకు, చిత్ర పరిశ్రమకు సమాధానం తెలియని ప్రశ్న.

ధోనీ, సుశాంత్​

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌... అనగానే అందరికీ గుర్తొచ్చే చిత్రం 'ఎం.ఎస్‌.ధోని'. నిజమైన ధోనీని మరిపించేంతగా సుశాంత్‌ ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ హెలికాప్టర్‌ షాట్‌.. అచ్చం అలాగే కొట్టాడు. భుజాలపై జెర్సీని అలాగే పైకి ఎగేశాడు. వ్యక్తిగత జీవితంలోనూ ధోని ఎలా ఉంటాడో... దాన్ని అనుకరించాడు. కాదు.. కాదు... జీవించాడు. 'ఎమ్‌.ఎస్‌.ధోని - ది అన్‌టోల్డ్‌ స్టోరీ' మూవీలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లపాటు సుశాంత్‌ సింగ్‌లోనూ ధోనిని చూసుకున్నారు ప్రేక్షకులు. అయితే జీవితం అనే ఆటలో సుశాంత్‌ మధ్యలోనే ఇన్నింగ్స్‌ ముగించాడు.

బుల్లితెరతో అడుగులు

బాలీవుడ్‌లో ఎలాంటి అండదండలు లేకుండా ఎదిగిన యువ సంచలనం సుశాంత్‌. ఏఐఈఈఈలో 7వ ర్యాంక్‌ సాధించిన ఆయన దిల్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాదిలో చదువు వదిలిపెట్టి, సినిమా కోసం ముంబై చేరుకున్నాడు. డ్యాన్సర్‌ అయిన సుశాంత్‌ మొదట బుల్లితెరపై మెరిశాడు. అంచలంచలుగా ఎదిగి బాలీవుడ్‌లో కీలక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 'కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌', 'పవిత్ర రిశ్తా' షోలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. 'నెస్లే మంచ్‌' యాడ్‌లోనూ నటించాడు.

దూసుకెళ్లిన కెరీర్‌

2013లో 'కై పో చె'తో కథానాయకుడిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత సుశాంత్‌ వెనుదిరిగి చూసుకోలేదు. 'శుద్ధ్‌ దేసీ రొమాన్స్‌', 'పీకే' చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపునిచ్చాయి. 2016లో వచ్చిన 'ఎమ్‌.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరి'తో ఆయన కెరీర్‌కి మరో పెద్ద మలుపు. 'రాబ్తా', 'కేదార్‌నాథ్‌', 'సోన్‌చిడియా', 'చిచ్చోరే', 'డ్రైవ్‌'... ఇలా వరుస సినిమాలతో కెరీర్‌లో ఒకొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయికి ఎదిగాడు. చివరిగా ముఖేష్‌ చాబ్రా దర్శకత్వంలో 'దిల్‌ బేచారా' చిత్రంలో నటించారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

కుంగుబాటే ఉసురు తీసిందా?

సుశాంత్‌ విజయవంతంగా కెరీర్‌ కొనసాగిస్తున్నప్పటికీ... కొన్ని నెలలుగా మానసిక కుంగుబాటు సమస్యతో సతమతమవుతున్నట్టు సమాచారం. చివరికి ఆ ఒత్తిడే ఆయన జీవితం అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణమై ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం ముంబయిలో తను ఉంటున్న ఇంటిలోనే సుశాంత్‌ ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు. ఎంతో భవిష్యత్తున్న నటుడి మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలన్నీ విషాదంలో మునిగిపోయాయి.

  • వారం కిందటే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశ సలియాన్‌ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వారంలోనే ఆయన తనువు చాలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమ్మను తలుచుకుంటూ...

1986లో పట్నాలో జన్మించిన సుశాంత్‌ 2002లో తన కన్నతల్లిని కోల్పోయారు. తల్లిని గుర్తు చేసుకుంటూ తరచూ కవితలు రాసేవారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చివరిగా ఓ పోస్ట్‌ పెట్టాడు. 'మసకబారిన నా గతం కన్నీటి ధారల మధ్య ఆవిరైపోతోంది. అంతులేని నా కలలు, అగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వుని కుచించుకుపోయేలా చేస్తోంది...' అంటూ తన తల్లి, తన ఫొటోల్ని కలిపి వారం క్రితం పోస్ట్‌ చేశారు.

ప్రముఖుల సంతాపం

సుశాంత్‌ మరణానికి చాలా మంది ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బాలీవుడ్‌ సినీ తారలు, క్రికెటర్లు, టాలీవుడ్‌ ప్రముఖులు మహేష్‌బాబు, వెంకటేష్‌, రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు, అల్లు అర్జున్‌ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details