బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ నటిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం షార్ట్ ఫిలిమ్స్, నాటకాల్లో నటిస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించింది.‘'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' అనే లఘు చిత్రంలో నటించి మెప్పించింది. పది నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో సుహానాతో పాటు నటుడు రోబిన్ గొనెల్ల కనిపించాడు.
ఇందులో ఓ యువ జంట జీవితం గురించి చూపించారు. వారి రెండు రోజుల రోడ్డు ట్రిప్ ఎలా గడిచిందనేదే కథ. ఈ లఘు చిత్రంలో సుహానా హావభావాలు, నటనా నైపుణ్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు థియోడర్ గిమెనో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. "ఈ ప్రాజెక్టును చివరికి మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఏడాదిగా ఈ లఘు చిత్రం కోసం పనిచేస్తున్నా. ఇలాంటి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది" అని తెలిపాడు.