పాత్రల్లో కొద్దిమంది నటిస్తారు. కొద్దిమందే జీవిస్తారు. ఇందులో రెండో రకం.. నివేదా థామస్. తెరపైన పాత్రలు తప్ప.. నివేదా అనే విషయం ఎప్పుడో కానీ గుర్తుకురాదు. 'వకీల్‌సాబ్'లో వేముల పల్లవి.. ఆమె సంఘర్షణ, ఆమె పోరాటమే కనిపిస్తుంది. ఎక్కడా ఇది పాత్ర, ఇది నటన అని ఎప్పుడూ అనిపించదు. నివేదా అంత సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సందర్భంగా నివేదా థామస్‌తో ఈటీవీ భారత్ ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ..
ప్రేక్షకుల మధ్య 'వకీల్‌సాబ్' సినిమాని చూశారు కదా. థియేటర్లో ఎలాంటి స్పందన కనిపించింది?
ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందనని ఆస్వాదించడానికే నేను థియేటర్‌కి వెళతా. వాళ్లు చప్పట్లు కొడుతున్న ఆ క్షణాల్ని చూసేందుకే సినిమా చేస్తాం. నా వరకు నేను ప్రేక్షకులతో కలిసి సినిమా చూసుకున్నాకే సమీక్షలు చదువుతా. ఆ తర్వాతే స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని తెలుసుకుంటా. 'వకీల్‌సాబ్' విడుదలకి ముందు వారం పైగా ఒంటరిగా హోటల్ గదిలో గడిపా. సినిమా విడుదలైన 9వ తేదీ నుంచి నా సెల్‌ఫోన్ మోగడం మొదలు పెట్టింది. 'వకీల్‌సాబ్'కి వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు. నేను చాలా హ్యాపీ.
వేముల పల్లవి పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?
పల్లవికి ఎదురైన అనుభవాలు నా జీవితంలో ఎదురుకాలేదు. కానీ నా స్నేహితుల జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. అలాంటివన్నీ విన్న నాకు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టాలపై ఓ అవగాహన ఉంటుంది కదా. పల్లవి పాత్ర ప్రతి అమ్మాయికీ రిలేట్ అవుతుంది. తమని తాము చూసుకునే ఓ పాత్ర అది. అందుకే పల్లవిగా నటించడం ఓ పెద్ద బాధ్యతగా భావించా. అలా అని మరీ లోతుగా ఆలోచిస్తే పాత్ర డ్రమటిక్‌గా అవుతుంది. అందుకే ఈ సినిమాని సగటు కథలాగే చూశా. అందుకే ఒక అమ్మాయి పడిన బాధ, ఆ నొప్పి అంత సహజంగా తెరపైకొచ్చింది. 'పింక్' సినిమా రెండుసార్లు చూశా. 'వకీల్‌సాబ్'కి సంతకం చేశాక మాత్రం చూడలేదు. సినిమా పరంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం స్క్రిప్టే. ఎముకల గూడు లేకపోతే మన దేహం ఎలా నిలబడదో, సరైన రచన లేనప్పుడు పాత్రా అంతే. బాగా రాసిన ఓ స్క్రిప్టు ఉందంటే నటుల పని సగం పూర్తయినట్టే. ఇదే కాదు, ఏ సినిమా విషయంలోనైనా రచనే నటుల్ని, సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల విశేషాలు?
సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నా. ఇదివరకు సినిమాలతోపాటు చదువూ ఉండేది. గతేడాదితో నా చదువు పూర్తయింది. ఇకపై సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెడతా.